థియేటర్ల సిబ్బందికి శివరాత్రి జాగారాలు  

శుక్రవారం విడుదల కాబోతున్న ఆదిపురుష్ కోసం థియేటర్లు వెయ్యి కాదు లక్ష కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. గత రెండు మూడు వారాలుగా బోసి పోతున్న సీట్లను నింపేందుకు నిజంగానే రఘురాముడు వస్తున్నాడన్నంత సంతోషంగా ఫీలవుతున్నారు. తెలుగులో ఏ క్షణంలో అయినా అనుమతులు వచ్చేలా ఉన్నాయి కానీ అటుపక్క నార్త్ లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ భీభత్సంగా జరుగుతున్నాయి. ఒక్క పివిఆర్ మల్టీప్లెక్స్ ఇంకా నాలుగు రోజులు ఉండగానే లక్షకు పైగా టికెట్లు విక్రయించడం షాక్ కలిగిస్తోంది. ఆర్ఆర్ఆర్ ని అప్పుడే దాటేసిందని ట్రేడ్ టాక్.

ఈ లెక్కన 16వ తేదీ నుంచి కనీసం మూడు రోజుల పాటు థియేటర్ స్టాఫ్ కి సరైన నిద్ర విశ్రాంతి దొరికే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే మొదటి వీకెండ్ వీలైనన్ని ఎక్కువ షోలు వేసుకునేందుకు ఎగ్జిబిటర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీ తెలంగాణలో అయిదు షోలకే పరిమితి ఉంది కాబట్టి ఉదయం 5 నుంచి 7 కంటే ముందు మొదలుపెట్టే ఛాన్స్ లేకపోవచ్చు. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సమస్య లేదు. తెల్లవార్లూ ఇష్టం వచ్చినన్ని షోలు వేసుకోవచ్చు. దానికి అనుగుణంగానే శని ఆదివారాలు కూడా అర్ధరాత్రి 1 నుంచి తెల్లవారుఝామున 4 వరకు ఇరవై నాలుగు గంటలు స్క్రీనింగ్స్ వేస్తూనే ఉంటారట

ఈ తాకిడిని తట్టుకోవాలంటే మల్టీప్లెక్స్ స్టాఫ్ కి దాదాపుగా ఇంటికి వెళ్లే ఛాన్స్ ఉండదు. అందుకే మొత్తం సిబ్బందిని షిఫ్ట్ ల వారిగా విభజించి తిండి, వసతి సదుపాయాలతో పాటు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ముంబై రిపోర్ట్. దృశ్యం 2, బ్రహ్మాస్త్ర లాంటి వాటికే ఇలాంటి ప్లానింగ్ జరిగినప్పుడు జైశ్రీరామ్ నినాదంతో ఊగిపోతున్న ఆదిపురుష్ ఫీవర్ కి ఏ స్థాయి ప్రిపరేషన్ అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా స్థానిక ప్రభుత్వాలు మద్దతు ఇస్తుండటంతో ఆదిపురుష్ పరిసరాలు శివరాత్రి జాగారాలను తలపించినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు