దమ్ముంటే సినిమా తీయండి.. రివ్యూ రైటర్లకు హీరో సవాల్

సినిమా రిజల్ట్ తేడా కొట్టగానే రివ్యూ రైటర్ల మీద తమ అసంతృప్తిని వెళ్లగక్కడం సినీ జనాలకు అలవాటే. సినిమా పోయిందనే బాధ అర్థం చేసుకోదగ్గదే కానీ.. రివ్యూల వల్ల సినిమా దెబ్బ తిందని అనుకోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. గత వారాంతంలో విడుదలైన ‘అన్ స్టాపబుల్’ సినిమాకు నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాకు వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

ఐతే ఈ సినిమా ఆడకపోవడానికి అందులో కంటెంట్ లేకపోవడం కంటే నెగెటివ్ రివ్యూలే కారణం అనుకున్నాడో ఏమో.. హీరో సన్నీ రివ్యూ రైటర్ల మీద తన అసహనాన్ని చూపించాడు. ఈ సినిమా సక్సెస్ మీట్లో సన్నీ రివ్యూ రైటర్ల మీద విమర్శలు గుప్పించాడు. దమ్ముంటే సినిమా తీసి తర్వాత మాట్లాడండి అంటూ రివ్యూ రైటర్లకు అతను సవాలు విసరడం గమనార్హం.

‘‘ఒక క్రికెటర్ పెయిన్ క్రికెటర్‌కే తెలుస్తుంది. ఒక లాయర్ పెయిన్ లాయర్‌కు, ఒక డాక్టర్ బాధ డాక్టర్‌కు, ఒక యాక్టర్ బాధ యాక్టర్‌కే తెలుస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చి మీకు దమ్ముండి.. ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి.. ఒక సినిమా తీసి.. ధైర్యం ఉండి.. దాన్ని ప్రమోట్ చేసి.. థియేటర్లో రిలీజ్ చేశాక రివ్యూ రైటర్ అవ్వు ఒప్పుకుంటా. సినిమా తీయాలంటే నాట్ ఎ జోక్ బ్రదర్. సినిమాను మా అమ్మలాగా భావిస్తాం. అదే మా జీవితం. దాన్ని నమ్ముకుని వచ్చాం. ఎక్కడో ఏసీలో కూర్చుని నీ పెన్నుతో నీకు నచ్చింది రాయడం తప్పు బ్రదర్.

పదిమందికి సహాయం చేయకపోయినా పర్వాలేదు. అన్యాయం చేయొద్దు. వాళ్లకి డైరెక్షన్ తెలీదు.. కెమెరా ఆపరేషన్ తెలీదు. వెనకాల పని చేసే సెట్ బాయ్ వరకు కూడా తెలియదు. ఎక్కడో కూర్చుని ఏదో రాస్తే మేమెందుకు పట్టించుకుంటాం బ్రదర్. ఒక్క రోజులో జడ్జిమెంట్ క్రియేట్ చేస్తున్నారు చూడండి అది తప్పు. ఆడియన్స్ వాడి మాట వీడి మాట వినకండి. మీ మాట మీరే వినండి. మీరెళ్లి చూడండి. వెళ్లాలనిపిస్తే వెళ్లండి. లేదంటే వెళ్లకండి. వాడెవడో ఇచ్చాడు. వాడే ఫైనల్ అని అనుకోకండి. ఎవరి అభిప్రాయం వాళ్లది. వాడెవడో నాలుగు సినిమాలు ఒకే రోజు చూశాడంట. నాలుగు సినిమాలు నాలుగు సంవత్సరాలు పడుతుంది. మీరు నాలుగు నిమిషాల్లో జడ్జిమెంట్ ఇచ్చేస్తారా? నువ్వు ఒక రోజు వచ్చి ఇండస్ట్రీలో పని చెయ్యి.

ఒక ఆర్టిస్టు కష్టం తెలుస్తుంది. ఆర్టిస్ట్ సంగతి పక్కన పెడితే.. వెనకాల పని చేసేవాళ్లు రోజుకు మూడొందలో నాలుగొందలో సంపాదిస్తాడు. దాంతోనే పెళ్లాం పిల్లల్ని చూసుకోవాలి. వాడికి ఎన్ని అప్పులుంటాయో తెలియదు. సమస్యలు ఎన్ని ఉన్నా చిరు నవ్వుతో పని చేస్తాడు. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరికీ చెప్పేది ఒక్కటే. సినిమా మాకు అమ్మ. ఇక్కడే ఉంటాం. పనితోనే జవాబు చెబుతాం. పెన్నుతో జడ్జిమెంట్ ఇచ్చేముందు ఇక్కడ వచ్చి చూడండి. మా బాధేంటో తెలుస్తుంది’’ అని సన్నీ అన్నాడు.