మొత్తానికి సస్పెన్స్ వీడినట్లే కనిపిస్తోంది. ‘ఆదిపురుష్’ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదనపు షోలు వేసుకోవడానికి.. అలాగే టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతులు దాదాపు వచ్చేసినట్లే అంటున్నారు. తెలంగాణలో ఎప్పట్నుంచో ఈ అనుమతులు సులువుగానే వచ్చేస్తున్నాయి. ‘ఆదిపురుష్’కు కూడా ఈ సౌలభ్యం లభించడం లాంఛనమే అని ముందే తేలిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొంత సస్పెన్స్ నడిచింది.
‘యువి క్రియేషన్స్’ అధినేతల్లో ఒకరైన విక్కీతో పాటు ఆదిపురుష్‌ను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ విజయవాడకు వెళ్లి.. ప్రభుత్వ పెద్దలను కలిసి అనుమతులు వచ్చేలా చేసుకున్నారు. ఈ సినిమాకు టికెట్ రేటు రూ.50 చొప్పున పెంచనున్నారట. మంగళవారం జీవో వస్తుందని.. అప్పుడే బుకింగ్స్ ఓపెన్ అవుతాయని అంటున్నారు. వారం రోజుల పాటు అలాగే అదనపు షోలు కూడా పడే అవకాశాలున్నాయి..
ఐతే టికెట్ల ధరల పెంపు సౌలభ్యం పొందడానికి ‘ఆదిపురుష్’ అర్హమైన సినిమానేనా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎందుకంటే ఏడాది కిందట ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల ప్రకారం అయితే ఈ సినిమాకు రేట్లు పెంచడానికి వీల్లేదు.ఆంధ్రప్రదేశ్‌లో కనీసం 20 శాతం చిత్రీకరణ జరుపుకుంటే తప్ప ఏ సినిమాకూ రేట్లు పెంచడానికి వీల్లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఐతే ‘ఆదిపురుష్’ పూర్తిగా ముంబయిలోని స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకుంది. మిగతాదంతా గ్రాఫిక్స్ సాయంతో నడిపించారు.
ఆంధ్రాల్లో ఒక్క రోజు కూడా ఈ సినిమా చిత్రీకరణ జరగలేదన్నది స్పష్టం. అలాంటపుడు దీనికి రేట్లు ఎలా పెంచేందుకు అనుమతించారన్నది ప్రశ్న. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి తప్ప.. ఒక్కో సినిమాకు ఒక్కోలా ఎలా ఉంటాయి? రేప్పొద్దున పవన్ కళ్యాణ్ సినిమా రిలీజైతే మాత్రం కచ్చితంగా నిబంధనలను అనుసరించే నిర్ణయాలు ఉంటాయి. ‘బ్రో’ సినిమాకు ఈ సౌలభ్యం కల్పించే అవకాశం ఉండకపోవచ్చు. మరి నెలన్నర రోజుల్లోనే రిలీజ్ కాబోతున్న ఆ చిత్రం విషయంలో ఏం చేస్తారన్నది ఆసక్తికరం