పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తానంటూ దర్శకులు, నిర్మాతలకు మాటలు బాగానే ఇస్తుంటాడు కానీ.. వాటిని నెరవేర్చడమే కష్టమైపోతుంటుంది. మామూలుగానే సినిమాల విషయంలో పవన్ స్పీడ్ తక్కువ. అందులోనూ రాజకీయాల్లోకి వచ్చాక కమిట్మెంట్లను నెరవేర్చడం ఇంకా కష్టమైపోయింది. ఐతే ఈ మధ్య పవన్ కష్టపడి, ఎలాగోలా వీలు చేసుకుని ఒక్కో కమిట్మెంట్‌ను నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నాడు.
ఆల్రెడీ ‘బ్రో’లో తన పార్ట్ అంతా పూర్తి చేసిన పవన్.. హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. అలాగే సుజీత్‌తో ‘ఓజీ’ షెడ్యూళ్లకు మార్చి మార్చి హాజరవుతున్నాడు. మరోవైపు చాన్నాళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ‘హరిహర వీరమల్లు’ను కూడా పూర్తి చేయడానికి చూస్తున్నాడు. కాగా ఇప్పుడు పవన్ మరో దర్శకుడికి కొత్తగా కమిట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాడు. అతనే.. సముద్రఖని.
‘బ్రో’ సినిమా.. తమిళ హిట్ ‘వినోదియ సిత్తం’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్‌ను రూపొందించిన సముద్రఖనినే తెలుగు రీమేక్‌ను తెరకెక్కించాడు. ఈ సినిమా షూట్ సందర్భంగా సముద్రఖని పని తీరుకు పవన్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. సముద్రఖని స్వయంగా తాను పవన్‌కు అభిమానిని అని కూడా ఓపెన్‌గా చెప్పుకోవడం విశేషం. ఆ అభిమానం, సముద్రఖని పని తీరు నచ్చి తనతో మరో సినిమా చేయడానికి పవన్ సుముఖత వ్యక్తం చేశాడట.
ఐతే ఈసారి వీళ్లిద్దరూ డైరెక్ట్ తెలుగు సినిమానే చేయబోతున్నారట. మంచి సబ్జెక్టుతో కలవమని.. వీలున్నపుడు సినిమా చేద్దామని సముద్రఖనికి పవన్ మాట ఇచ్చాడట. పవన్ సినిమా చేయాల్సిన నిర్మాతలు ఇంకొంతమంది ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత వారిలో ఎవరో ఒకరికి ఈ సినిమా చేసే అవకాశముంది. ‘బ్రో’ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates