సినిమాలు బోలెడు ప్రేక్షకులు గుప్పెడు

టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పుడూ లేనంత డ్రై పీరియడ్ ని చూస్తోంది. వేసవి సెలవుల్లో కళకళలాడాల్సిన థియేటర్లు వెలవెలబోతున్నాయి. చాలా చోట్ల కనీసం పది మంది లేక షోలు క్యాన్సిలవుతున్నాయి. వారానికి మూడు నాలుగు రిలీజులున్నా సరే పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మొన్న వచ్చిన వాటిలో నేను స్టూడెంట్ సర్ లో ఓ మోస్తరు యావరేజ్ కంటెంట్ ఉన్నా ఆడియన్స్ దాని జోలికి వెళ్లడం లేదు. పరేషాన్ కోసం రానా ఎన్ని ప్రమోషనలు చేసినా, తెలంగాణ యూత్ కామెడీ అంటూ ఎంత పబ్లిసిటీ చేసినా లాభం లేకుండా పోతోంది. జనం ఆసక్తి చూపించడం లేదు

ఇక అహింస మొదటి రోజే క్రాష్ ల్యాండింగ్ అయిపోయింది. దర్శకుడు తేజ బ్రాండ్, వెంకటేష్ ప్రెస్ మీట్ కి రావడం కొంత మేర ఉపయోగపడినా అసలైన మ్యాటర్ మరీ వీక్ గా ఉండటంతో ఆదివారం కూడా షోలు అంతంత మాత్రం రన్ చేసే సీన్ ఏర్పడింది. అంతకు ముందు వచ్చిన మేం ఫేమస్ కొంచెం నయమనిపించుకున్నా ఛాయ్ బిస్కెట్ బృందం పూర్తిగా నైజాం ఫ్రీ షోలతో ప్రమోషన్ చేస్తుండటంతో ఏపీలో దాదాపు ఫైనల్ రన్ కి వచ్చేసింది. 2018 కూడా ఓటిటి డేట్ బయటికి వచ్చేక స్లో అయ్యింది. కాకపోతే కలెక్షన్లు డీసెంట్ గా ఉన్నాయి.

మెయిన్ సెంటర్స్ లో విరూపాక్ష ఇంకా కొనసాగిస్తున్నారంటేనే సిచువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిచ్చగాడు 2 ఏదో మాస్ ఆడియన్స్ పుణ్యమాని ఎలాంటి టెన్షన్ లేకుండా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వెళ్ళింది. ఎగబడి చూడటం లేదు కానీ ఉన్నంతలో కాసింత చెప్పుకునే నెంబర్స్ దీనికే వస్తున్నాయి. ఈ శుక్రవారం రాబోయే సిద్ధార్థ్ టక్కర్, బిగ్ బాస్ సన్నీ అన్ స్టాపబుల్ మీద హైప్ ఏమీ లేదు. మార్నింగ్ షో అయ్యాక టాక్ ఎక్స్ ట్రాడినరిగా వస్తే తప్ప. చూస్తుంటే జూన్ 16 ఆదిపురుష్ వచ్చేదాకా ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే హాలిడేస్ అయిపోతాయి . ప్రభాస్ సినిమా కాబట్టి అదేమీ ఇబ్బంది కాదు