మణిరత్నం ఇళయరాజా ఇద్దరూ ఇద్దరే

సెలబ్రిటీల పుట్టినరోజులు అభిమానులు జరుపుకోవడం పెద్ద విశేషం కాదు కానీ ఇద్దరు లెజెండ్స్ అనబడే దిగ్గజాలకు ఒకే రోజు బర్త్ డే కావడం అది కూడా ఆ కలయిక సౌత్ సినిమా గర్వపడే ఎన్నో క్లాసిక్స్ ఇవ్వడం మాత్రం అరుదైన  విషయమే. అది మణిరత్నం – ఇళయరాజాలకు మాత్రమే కుదిరింది. జూన్ 2 వీళ్ళ జన్మదినం. ఈ కాంబో 1983లో అనిల్ కపూర్ పల్లవి అనుపల్లవితో మొదలైంది. తర్వాత మలయాళంలో ఒకటి తమిళంలో రెండుతో కంటిన్యూ అయ్యింది కానీ అసలైన బ్లాక్ బస్టర్ దక్కింది మాత్రం 1986లో వచ్చిన మ్యూజికల్ క్లాసిక్ మౌన రాగంతోనే .

ఆ మరుసటి సంవత్సరమే కమల్ హాసన్ నాయకుడు రూపంలో ఆవిష్కరించిన ఆల్ టైం క్లాసిక్ చరిత్రలో నిలిచిపోయింది. కార్తీ ప్రభుల మల్టీ స్టారర్ ఘర్షణ మరో మేలిమలుపు. ఇక నాగార్జున గీతాంజలి గురించి చెప్పుకుంటూ పొతే రోజులు సరిపోవు. ఆ తరంలో పుట్టని ఇప్పటి యూత్ కి సైతం హృదయాలను కదిలించే సంగీతం అందులో వినిపిస్తుంది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా అంజలితో చేసిన  మేజిక్ ఇంకా చెక్కుచెదరలేదు. ఇలా నిర్విరామంగా కొనసాగుతున్న వీళ్ళ జైత్రయాత్ర 1991 దళపతితో ముగింపుకొచ్చింది. రజనీకాంత్ మమ్ముట్టిల స్నేహంతో పోటీ పడుతూ ఛార్ట్ బస్టరైన మ్యూజిక్ ఇది.

కారణాలు ఏవైనా మణిరత్నం రోజాతో ఏఅర్ రెహమాన్ దోస్తీ పట్టాక రాజాతో సినిమాలు సాధ్యం కాలేదు.  కానీ అప్పటిదాకా ఎనిమిదేళ్ల ప్రయాణంలో మణి రాజాల కాంబినేషన్ లో వచ్చిన ప్రతి పాట ఆణిముత్యంలా నిలిచిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని సైతం పదే పదే వినేలా చేసిన ఘనత వీళ్ళకే చెందుతుంది. మళ్ళీ ఎప్పటికైనా కలవకపోతారాని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ పొన్నియిన్ సెల్వన్ దాకా రెహమాన్ తప్ప మరో ఆలోచన చేయని మణిరత్నం తిరిగి ఇళయరాజాతో చేతులు కలవడం స్వప్నమే. రాజాగారు వెయ్యి సినిమాలు చేసినా మణికి ఇచ్చిన ఆల్బమ్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది