నో రిస్క్ ప్రదేశంలో త్రివిక్రమ్

నిన్న విడుదలైన గుంటూరు కారం టీజర్ కి ఫ్యాన్స్ నుంచి బ్రహ్మాండమైన స్పందన దక్కింది. పుణ్యం పురుషార్థం రెండూ ఒకేసారి దక్కినట్టు ఈ లాంచ్ ని మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ కు ముడిపెట్టడంతో దాదాపు నిన్న సాయంత్రం షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఎంత కృష్ణ గారి బ్లాక్ బస్టర్ అయినా మాములు పరిస్థితుల్లో ఇంత స్పందన రావడం అసాధ్యం. వైజాగ్ జగదాంబ లాంటి అతి పెద్ద థియేటర్లో టికెట్లన్నీ అమ్ముడుపోవడమంటే మాములు విషయం కాదు. ఇరవై నాలుగు గంటలు గడవక ముందు టీజర్ ఇరవై మిలియన్ల వ్యూస్ చేరుకోవడం రికార్డుగా చెప్పాలి.

ఇదలా ఉంచితే గుంటూరు కారం టీజర్  చూశాక త్రివిక్రమ్ చాలా సేఫ్ గేమ్ ఆడుతూ రిస్క్ లేకుండా కమర్షియల్ సక్సెస్ మీద కన్ను వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే అల వైకుంఠపురములో టెంప్లేట్ ఫాలో అయ్యారు. అందులో క్లైమాక్స్ లాగే ఇక్కడ కూడా మహేష్ అదే టైపు కాస్ట్యూమ్ వేసుకుని నడుచుకుంటూ రావడం, నోట్లో బీడీ వెలిగించుకోవడం, బ్యాక్ గ్రౌండ్ లో సిత్తరాల సిరపడు టైపు బిట్ సాంగ్ ప్లే కావడం ఇలా చాలా పోలికలే ఉన్నాయి. ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ప్రయోగాల జోలికి వెళ్ళరు వెళ్ళలేరు

కథ పరంగా కూడా మరీ అద్భుతంగా ఏమీ ఉండకపోవచ్చు. గురూజీ మాయాజాలమంతా స్క్రీన్ ప్లే, మాటల్లోనే ఉంటుంది. కాబట్టి గుంటూరు కారంలో మనం ఎన్నడూ చూడని బ్యాక్ డ్రాప్ కానీ ట్విస్టులు కానీ ఉండకపోవచ్చు. అసలే పలు మార్లు రిపేర్లు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అతడులో జరిగిన పొరపాట్లు, ఖలేజాలో తలెత్తిన లోపాలు రాకుండా ఈసారి పూర్తి మసాలా ప్యాకేజ్ ఇవ్వబోతున్నరట. తమన్ ఉంటాడో లేదో అనే కామెంట్స్ కి సమాధానంగా నిన్న ఒక ట్వీట్ లో బెస్ట్ ఆల్బమ్ ఇస్తానని అతనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అనుమానాలు తీరిపోయాయి. ఆగస్ట్ 9 ట్రైలర్ రానుంది