సూపర్ స్టార్ కృష్ణ – సాహసమే ఇంటి పేరు

సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మనమధ్య లేకపోయినా తెలుగు సినిమా గమనాన్ని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎప్పటికీ నిలిచిపోతుంది. 1965లో ఆదుర్తి సుబ్బారావుగారి తేనే మనసులతో ఎంట్రీ ఇచ్చే నాటికి కృష్ణ చుట్టూ ఎన్నో సవాళ్లు. రెగ్యులర్ పంథాలో వెళ్తే గెలవడం కష్టమని గుర్తించి మూడో సినిమా గూఢచారి 116తో జేమ్స్ బాండ్ ట్రెండ్ ని టాలీవుడ్ కు తీసుకొచ్చారు. అతి తక్కువ కాలంలో బాపుగారి సాక్షిలో నటనకు  ప్రశంసలతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ అవే కళ్ళు. నెగటివ్ షేడ్స్ ఉన్న నేరము శిక్ష ఇలా ఏదీ చేసినా  ప్రయోగాలే ప్రాధాన్యంగా ఉండేవి

దిగ్గజాలు స్క్రిప్ట్ రాయించినా చేయలేకపోయిన అల్లూరి సీతారామరాజుని 1974లో భారీ ఎత్తున 70 ఎంఎంలో నిర్మించడం ఒక గొప్ప మలుపు. మన్నెం వీరుడిగా మళ్ళీ ఆ క్యారెక్టర్ ని ఎవరూ ఆ స్థాయిలో పునఃసృష్టి చేయలేకపోయారు. దాని తర్వాత వరసగా ఒకటి రెండు కాదు 14 ఫ్లాపులు వచ్చినా తట్టుకుని తిరిగి స్వంత బ్యానర్ పద్మాలయ మీద పాడి పంటలుతో హిట్టు తిరిగి ట్రాక్ లోకి వచ్చారు. అగ్ని పర్వతం, కిరాయి కోటిగాడు లాంటి కమర్షియల్ చిత్రాలు కృష్ణ రియల్ మాస్ ని బయటికి తీసుకొచ్చాయి. ఇప్పుడంటే బాహుబలిని భుజాలకెత్తుకున్నాం కానీ 1986లో సింహాసనంకు పెట్టిన ఖర్చు, దానికి వచ్చిన ఓపెనింగ్స్ రికార్డులు కొన్నేళ్ల పాటు చెక్కుచెదరలేదు.

చిరంజీవి బాలకృష్ణల హయాం మొదలయ్యాక కొంత స్పీడ్ తగ్గినప్పటికీ 1994లో ఎస్వి కృష్ణారెడ్డి నెంబర్ వన్ తో తిరిగి బౌన్స్ బ్యాక్ కావడం అనూహ్యం. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కు చూడాల్సిన అవసరం లేకపోయింది. అమ్మదొంగాలాంటి మంచి హిట్లతో తిరిగి మార్కెట్ సాధించుకున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ తో జట్టు కట్టిన కృష్ణ ఎక్కువకాలం కొనసాగలేకపోయారు. దర్శకుడిగా కృష్ణ వేసిన ముద్ర ప్రత్యేకం. సింహాసనంతో పాటు కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు లాంటి ఎన్నో విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం. ఎనభై ఏళ్ళు కాదు ఎనిమిది వందల ఏళ్ళు దాటినా కృష్ణ గారి ముద్ర  ఇండియన్ సినిమాలో ఎప్పటికీ ప్రత్యేకం