ది కేరళ స్టోరీ.. ఈ మధ్య కాలంలో ఎంతో వివాదాస్పదం అయిన సినిమా. విడుదలకు ముందు ట్రైలర్‌తోనే ఈ చిత్రం సంచలనం రేపింది. కేరళలో హిందూ, ఇతర మతాల అమ్మాయిలను వలలో వేసుకుని వారిని ఇస్లాం మతంలోకి మార్చి ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుకోవడం.. హింసకు పాల్పడటం.. ఈ నేపథ్యంలో సుదీప్తో సేన్ రూపొందించిన ఈ చిత్రం అనేక వివాదాలకు దారి తీసింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మద్దతుతో కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే ముస్లింల మీద విషం చిమ్మేలా రూపొందించిన ప్రాపగండా ఫిలిం ఇదంటూ లిబరల్స్ మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేధం కూడా విధించాయి. కానీ అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనికి పన్ను మినహాయింపును కూడా ఇచ్చాయి. విమర్శల సంగతి పక్కన పెడితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుంది.
ఐతే విలక్షణ నటుడు కమల్ హాసన్ ఈ సినిమా విషయంలో తన వ్యతిరేకతను బయటపెట్టాడు. నేను ఎప్పుడూ ఒకటే మాట చెబుతుంటాను. నాకు ప్రాపగండా సినిమాలు నచ్చవు. సినిమా టైటిల్ కింద నిజమైన కథ అని రాసినంత మాత్రాన సరిపోదు. అలా రాసినంత మాత్రాన అది నిజమైన కథ అయిపోదు అంటూ కేరళ స్టోరీ సినిమాపై చురకలు వేశారు కమల్ హాసన్.
ఈ సినిమా మీద విమర్శలు చేస్తే మోడీ అండ్ కోకు కోపం వస్తుందేమో అని సెలబ్రెటీలు భయపడి ఉంటారు కానీ.. కమల్ మాత్రం బోల్డ్‌గా తన అభిప్రాయం చెప్పారు. కేరళలో 30 వేల మందికి పైగా హిందూ, ఇతర మతాల అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతం మార్పించారని ఈ చిత్ర రూపకర్తలు ముందు ప్రకటించగా.. దానిపై వివాదం చెలరేగడంతో తర్వాత అలా జరిగింది ముగ్గురికే అంటూ మాట మార్చారు. వివాదాలను దాటుకుని ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates