ఈ వ‌య‌సులో ఈ ఊపేంటి త్రిషా..

త‌మిళ క‌థానాయిక‌ త్రిషకు ఈ మ‌ధ్యే 40 ఏళ్లు నిండాయి. ఈ వ‌య‌సులో హీరోయిన్ వేషాలు ప‌క్క‌న పెట్టి.. క్యారెక్ట‌ర్ రోల్స్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతుంది. కానీ త్రిష మాత్రం ఇంకా చెక్కు చెద‌ర‌ని అందంతో.. భారీ సినిమాల్లో లీడ్ రోల్స్‌తో అభిమానుల‌ను అల‌రిస్తోంది. ఈ మ‌ధ్యే పొన్నియ‌న్ సెల్వ‌న్-2లో త‌న అందం, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు మైమ‌రిచిపోయారు.

మ‌ధ్య‌లో కెరీర్ డౌన్ అయి ఇక సినిమాలే మానేయాల్సిన స్థితిలో క‌నిపించిన త్రిష‌.. ఈ మ‌ధ్య చేస్తున్న‌, చేయ‌బోతున్న సినిమాల వ‌రుస చూస్తే షాక‌వ్వ‌క త‌ప్ప‌దు. ఆల్రెడీ విజ‌య్ లాంటి టాప్ స్టార్‌తో లియో సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది త్రిష‌. ఇప్పుడు అజిత్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనున్న‌ట్లు స‌మాచారం.

అజిత్ హీరోగా మ‌గిల్ తిరుమ‌ణి ఓ సినిమా రూపొందించ‌బోతున్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌బోతోంది. ఇందులో క‌థానాయిక‌గా త్రిష దాదాపుగా ఓకే అయిన‌ట్లు స‌మాచారం. ఒక త‌రం స్టార్ హీరోయిన్ల‌తో న‌టించాక స్టార్ హీరోలు.. కొత్త త‌రం హీరోయిన్ల వైపు మొగ్గుతుంటారు.

హీరోల‌కు ఎంత వ‌య‌సొచ్చినా ప‌ర్వాలేదు కానీ.. హీరోయిన్ల విష‌యంలో అలా ఉండ‌దు. పాత నీరు పోయి కొత్త నీరు వ‌స్తుంటుంది. కానీ న‌య‌న‌తార‌, త్రిష లాంటి హీరోయిన్లు మాత్రం ఇంకా త‌మ హ‌వా న‌డిపిస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మ‌ణిర‌త్నం దర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ చేయ‌నున్న‌ కొత్త చిత్రంలోనూ త్రిష క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.