బాలయ్యతో క్రేజీ మల్టీస్టారర్!


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఆయన బోయపాటి శ్రీనుతో ‘అఖండ-2’ చేయొచ్చని వార్తలొస్తున్నాయి. మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కూడా బాలయ్యతో ఓ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ రెండు సినిమాల గురించి ఓ వైపు చర్చ జరుగుతుంటే.. మరోవైపు బాలయ్య ఒక క్రేజీ మల్టీస్టారర్లో నటించబోతున్నట్లు ఒక హాట్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఆయన తనకు వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితుడైన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం.

గతంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలయ్య కోసం చిన్న క్యామియో చేశాడు శివరాజ్. అందుకు బదులుగా శివరాజ్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి బాలయ్య రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి.

కన్నడ-తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాను కన్నడ యువ దర్శకుడు హర్ష రూపొందించనున్నాడట. వేరే నిర్మాతలతో కలిసి సొంత నిర్మాణ సంస్థలో శివరాజ్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించేందుకు రెడీ అయినట్లు సమాచారం. కన్నడలో బాలయ్య సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొనడం ఖాయం. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుందట.

సెకండ్ పార్ట్‌లో ఇంకో పెద్ద స్టార్‌తో ప్రత్యేక పాత్ర చేయించాలనుకుంటున్నారని.. రజినీకాంత్‌‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. నిజంగా ఈ ముగ్గురి కాంబినేషన్ ఓకే అయితే బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం. మరి ఇదంతా ఉత్త ప్రచారమా.. నిజంగా ఈ కలయికలో సినిమా పట్టాలెక్కుతుందా అన్నది చూడాలి. త్వరలోనే దీనిపై స్పష్టత రావచ్చు.