మెగా ప్రిన్స్ అంత రిస్క్ చేస్తాడా

ఫిదా, తొలిప్రేమ వరస సక్సెస్ లతో కెరీర్ మంచి ఊపు మీదకు తెచ్చుకున్న వరుణ్ తేజ్ కు అంతరిక్షం పెద్ద షాక్ ఇచ్చింది. ఎఫ్2, ఎఫ్3లు హిట్టయినా వాటిలో మేజర్ క్రెడిట్ వెంకటేష్ కి వెళ్లిపోయింది. మిగిలింది దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పంచుకోవాల్సి వచ్చింది. గత కొన్నేళ్లలో ఈ మెగా ప్రిన్స్ కు చెప్పుకోదగ్గ సినిమా గద్దలకొండ గణేష్ ఒకటే. అదీ బ్లాక్ బస్టరేం కాదు. జస్ట్ యావరేజ్ కి హిట్ కి మధ్యలో నిలబడి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. గత ఏడాది ఒంటిని కష్టపెట్టి మరీ చేసిన గని డిజాస్టర్ ఇచ్చిన ట్విస్టు మాములుది కాదు. ఏకంగా ఫ్యాన్స్ కి సారీ చెప్పాడు.

ప్రస్తుతం ప్రవీణ్ సత్తారుతో గాండీవధారి అర్జున చేస్తున్న వరుణ్ తేజ్ కు బాలీవుడ్ హిట్ మూవీ భూల్ భులయ్యా 2 రీమేక్ ప్రతిపాదన వచ్చినట్టు లేటెస్ట్ లీక్. హిందీలో సక్సెస్ అయ్యింది కానీ ఇది రిస్కీ ప్రాజెక్ట్. ఒరిజినల్ వెర్షన్ లో కార్తీక్ ఆర్యన్ నటించాడు. కానీ సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన టబు క్యారెక్టర్ ఎక్కువ హైలైట్ అయ్యింది. పాజిటివ్ నెగటివ్ షేడ్స్ ని ఆవిడ పోషించిన తీరు దాని విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఏ భాషలో చేసినా మళ్ళీ ఆవిడే చేయాలనేంత గొప్పగా వచ్చింది. ఇలాంటివి మన తెలుగు ఆడియన్స్ కి అంత సులభంగా కనెక్ట్ అవ్వవు.

పైగా ఈ ప్రపోజల్ కి దర్శకుడు రమేష్ వర్మట. రవితేజకు ఖిలాడీ రూపంలో సూపర్ ఫ్లాప్ ఇచ్చింది ఈయనే. రాక్షసుడు రీమేక్ ని బాగా హ్యాండిల్ చేశాడన్న పాజిటివ్ కార్నర్ తోనే బండి నెట్టుకుంటూ వస్తున్నాడు. భూల్ భులాయ్యా 2ని ఎలా డీల్ చేసినా వరుణ్ తేజ్ కున్న మార్కెట్ కి ఇమేజ్ కి ఇది ఖచ్చితంగా అలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన చిత్రమవుతుంది. ప్రస్తుతం డిస్కషన్ స్టేజిలో ఉంది కనక ఇంకా కంక్లూజన్ కి రాలేదట. అయినా ఏదైనా డిఫరెంట్ గా అలోచించి కొత్త డైరెక్టర్లతో చేస్తే బాగుంటుంది కానీ ఓటిటిలో చూసేసి అరిగిపోయినవి ఎలా అయినా రిస్కే.