ఛార్మి దిగి రాక తప్పట్లే..

‘లైగర్’ సినిమా విడుదలై తొమ్మిది నెలలు కావస్తోంది. కానీ ఆ సినిమా నష్టాల తాలూకు గొడవ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘లైగర్’ వల్ల మరీ దారుణంగా దెబ్బ తిన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు.. ఆ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన కొన్ని రోజులకే తమకు నష్ట పరిహారం ఇవ్వాలని నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మిలను కోరడం.. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ధర్నాకు సిద్ధపడటం.. ఇంతలో పూరి వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి వైరల్ కావడం.. తర్వాత ఆయన కేసుల వరకు వెళ్లడం.. ఈ తతంగం అంతా తెలిసిందే.

మధ్యలో కొన్ని నెలల పాటు ఈ వ్యవహారంలో ఏ అప్‌డేట్స్ లేవు. కానీ కొన్ని రోజుల కిందట లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నిరాహార దీక్షలకు కూర్చోవడం సంచలనం రేపింది. రోజు రోజుకూ ఈ వ్యవహారం తీవ్రత పెరుగుతున్న సంకేతాలు కనిపించాయి. కానీ పూరి, ఛార్మిల నుంచి మాత్రం ఏ స్పందనా కనిపించలేదు. ఐతే ఈ వ్యవహారంలో సునీల్ నారంగ్ తరహా పెద్ద స్థాయి వ్యక్తులు.. అలాగే ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకోవడంతో పూరి, ఛార్మి దిగి రాక తప్పలేదు.

బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని మెజారిటీ అభిప్రాయ పడ్డ నేపథ్యంలో పూరి, ఛార్మి సెటిల్మెంట్‌కు రెడీ అయినట్లు తెలుస్తోంది. బయ్యర్లకు న్యాయం చేస్తామని.. త్వరలోనే వారికి నష్టపరిహారం చెల్లిస్తామని తాజాగా ఛార్మి.. ఫిలిం ఛాంబర్‌కు తాజాగా మెయిల్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నిరాహార దీక్షను విరమించారు. పూరి, ఛార్మి తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్న బాధితులు.. దీక్షకు దిగిన కొందరు పంపిణీదారుల ఆరోగ్యం దెబ్బ తిందని.. వారి శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని దీక్షను విరమిస్తున్నట్లు తెలిపారు. మరి ఈ వ్యవహారానికి పూరి, ఛార్మి ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.