ఐమాక్స్‌లో రివ్యూలు చెప్పుకునే స్థాయి నుంచి..

ఎవడబ్బ కాదు టాలెంటు అంటూ ఒక సినిమాలో పాట ఉంటుంది. ఐతే సినీ రంగంలో టాలెంట్ ఉంటే సరిపోదు. సరైన అవకాశం రావాలి. దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలా అందరికీ సాధ్యం కాదు. ఐతే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు వ్యక్తుల టాలెంట్ అందరికీ తెలిసే మార్గాలు కనిపిస్తున్నాయి. ఒక వీడియోతో పాపులర్ అయి.. జీవితాలను మార్చేసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు.

ఈ ఉపోద్ఘాతం అంతా ఇప్పుడు ఎందుకు అంటే.. ప్రసాద్ ఐమాక్స్ ముందు ప్రతి శుక్రవారం మీడియా మైకుల ముందు రివ్యూలు చెప్పుకునే వాళ్లు కూడా ఆ పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు సంపాదించేస్తుండటం విశేషం. బ్రో.. బ్రో అంటూ పీక్స్‌లో పెర్ఫామెన్స్ ఇస్తూ అందరి దృష్టినీ ఆకర్షించిన ఒక కుర్రాడు.. ఆ పాపులారిటీతో ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించాడు. అతను హీరోగా కూడా ఒక సినిమా రాబోతోంది త్వరలో.

ఇక ఇలాగే రివ్యూలు చెప్పుకునే సుమంత్ ప్రభాస్ అనే కుర్రాడిది ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ పాపులారిటీతోనే అతను కొన్ని వీడియో సాంగ్స్, షార్ట్స్‌లో నటించాడు. అవి అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలా ఛాయ్ బిస్కెట్ సంస్థతో అసోసియేట్ అయిన సుమంత్.. ఇప్పుడు ఏకంగా ఒక సినిమాలో హీరోగా నటించడమే కాక.. దాన్ని తనే స్వయంగా డైరెక్ట్ చేశాడు. ఆ చిత్రమే.. మేమ్ ఫేమస్. ఈ చిన్న సినిమా ఈ మధ్య కాలంలో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. సెలబ్రెటీలను ఇన్వాల్వ్ చేస్తూ ఈ చిత్రానికి చేసిన వెరైటీ ప్రమోషన్లు ప్రేక్షకులను ఈ సినిమా వైపు ఆకర్షించాయి.

ముందు ఎంత హడావుడి చేసినా.. సినిమాలో కంటెంట్ ఎలా ఉందన్నది కీలకం. ఐతే తాజాగా రిలీజైన ‘మేమ్ ఫేమస్’ ట్రైలర్ చూస్తే.. సుమంత్ ప్రభాస్ తక్కువోడు కాదు అనిపిస్తోంది. సినిమాలో విషయం ఉన్నట్లే కనిపిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా సాగి సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఐమాక్స్ ముందు రివ్యూలు చెప్పుకునే కుర్రాడు.. ఇలాంటి సినిమా తీశాడు అంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. ఈ నెల 26న విడుదల కానున్న ఈ సినిమా హిట్టయితే ఈ కుర్రాడి రేంజే మారిపోతుందనడంలో సందేహం లేదు.