టైమ్ లేదు.. RRR చూడలేదు

ప్రియాంక చోప్రా ఇప్పుడు ఒక హాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకుని ఇంటర్నేషనల్ సినిమాలు, సిరీస్‌ల్లో అవకాశాలు దక్కించుకుని గ్లోబల్ స్టార్ అయి ఉండొచ్చు. కానీ ఆమె ఒకప్పుడు సగటు బాలీవుడ్ హీరోయినే. తెలుగులో ఓ చిన్న సినిమాలో ఛాన్సొస్తే అందులోనూ నటించిందామె. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదలకు కూడా నోచుకోలేదు. అలాంటి హీరోయిన్.. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లతో ప్రశంసలు దక్కించుకుని.. ‘ఆస్కార్’ పురస్కారాల్లో కూడా సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూడనే లేదట.

రాజమౌళి తెలుగు వాడని.. అందులో నటించిన హీరోలు కూడా తెలుగు వాళ్లని కూడా తెలిసి గతంలో ఆమె ‘ఆర్ఆర్ఆర్’ను తమిళ సినిమా అని పేర్కొని విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడేమో తాను ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడలేదని చెప్పడం చర్చనీయాంశమైంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రియాంక చూసినా చూడకపోయినా ఓకే కానీ.. చూడలేదు అన్నాక అందుకు కారణం చెప్పిన కారణమే సిల్లీగా ఉంది.

తనకు ఈ సినిమా చూసే సమయం దొరకలేదని ఆమె అంది. తాను నిజానికి సినిమాలు పెద్దగా చూడనని.. ఇంట్లో ఖాళీగా ఉన్నపుడు టీవీ షోలు చూస్తానని తర్వాత ఆమె కవరప్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ‘ఆర్ఆర్ఆర్’ గత ఏడాది కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే.

పైగా అందులో ఆలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి బాలీవుడ్ స్టార్లు కూడా నటించారు. రామ్ చరణ్ ఆమెకు ఒకప్పుడు కోస్టార్ కూడా. అలాంటి సినిమాను ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న ప్రియాంక చూడకపోవడం.. అందుకు కారణం తనకు టైం లేదని చెప్పడం మరీ అతిగా అనిపిస్తోంది జనాలకు. కనీసం మూడు గంటల సమయం కూడా ఈ సినిమాకు కేటాయించలేని స్థాయిలో ఉన్నావా.. హాలీవుడ్ హీరోయిన్ అయిపోయావనే బిల్డప్పా అంటూ నెటిజన్లు ఆమె మీద కౌంటర్లు వేస్తున్నారు.