నవ్వించి ఏడ్పించే ఫ్యామిలీ శకునాలు

తెలుగులో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు చాలా గ్యాప్ వచ్చేసింది. గత రెండు బ్లాక్ బస్టర్లలో దసరా ఊర మాస్ కాగా విరూపాక్ష హారర్ జానర్. రెండిట్లో హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ లేవు. అందుకే అన్నీ మంచి శకునములే మీద ప్రేక్షకుల్లో అంతో ఇంతో బజ్ నెలకొంది. ఓ బేబీ సూపర్ హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న దర్శకురాలు నందిని రెడ్డి ఈసారి స్వప్న సినిమా బ్యానర్ తో చేతులు కలిపారు. సీతారామం లాంటి సూపర్ హిట్ తర్వాత ఈ ప్రొడక్షన్ నుంచి వస్తున్న మూవీ కావడం విశేషం. ఈ నెల 18న విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ ని జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు.

అనగనగా రెండు కుటుంబాలు. ఇద్దరు పెద్దలు(నరేష్-రాజేంద్రప్రసాద్). పిల్లలు పసితనంలో ఉన్నప్పుడే ఏదో కోర్టు సమస్య వచ్చి విడిపోతారు. పెద్దయ్యాక ఊటీ హిల్ స్టేషన్ లో సెటిలవుతారు. అబ్బాయి(సంతోష్ శోభన్) అమ్మాయి(మాళవిక నాయర్) పరిచయంలో ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చి పరిచయం ప్రేమగా మార్చుకుంటారు. ఈ లోగా కొన్ని అనూహ్యమైన సంఘటనలు. సరదాగా గడిచిపోతున్న జీవితాల్లో ఏదో అలజడి. దానికి పరిష్కారం కావాలి. అదేంటనేది శకునములు చూస్తే కానీ తెలియదు. వీడియో మొత్తం కూల్ విజువల్స్ అండ్ కామెడీతో నింపేశారు.

ఆలా మొదలైంది, కళ్యాణ వైభోగమే తర్వాత నందిని రెడ్డి మళ్ళీ ఆ టైపు ఎంటర్ టైన్మెంట్ ఇందులోనే పొందుపరిచినట్టు కనిపిస్తోంది. మిక్కీ జె మేయర్ నేపధ్య సంగీతం, లక్మి భూపాల మాటలు, సన్నీ-రిచర్డ్ ఛాయాగ్రహణం అన్నీ ఫీల్ గుడ్ మూవీ అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పటిలాగే సంతోష్ శోభన్ చలాకీగా నటించగా మాళవిక నాయర్ లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. పెద్దగా పోటీ లేకుండా బరిలో దిగుతున్న అన్ని మంచి శకునములేకు ప్రీ రిలీజ్ శకునాలు పాజిటివ్ గా ఉన్నాయి. కథా కథనాలు బాగుంటే చాలా గ్యాప్ తర్వాత కుర్రాడికో హిట్టు పడ్డట్టే.