ఆ పోస్టర్ కాపీ కాదట

మన సినిమాలకు సంబంధించి కొన్ని ప్రోమోలు చూసి ఔరా అనుకుంటాం. భలే క్రియేటివ్‌గా చేశారే అని కొనియాడుతాం. తీరా చూస్తే అది ఏ హాలీవుడ్ మూవీ సినిమా పోస్టర్‌కో కాపీ అని తెలుస్తుంది. ఇంటర్నెట్, ఓటీటీ విప్లవం పుణ్యమా అని వరల్డ్ సినిమా మారుమూల పల్లెలకు కూడా పరిచయం అయిపోతున్న ఈ రోజుల్లో ఎక్కడైనా కంటెంట్ కాపీ కొడితే అది ఎక్కువ కాలం దాగదు.

సోషల్ మీడియా జనాలు కొన్ని గంటల్లోనే ఒరిజినల్ బయటికి తీసి కాపీ అని తేల్చేస్తారు. నిన్న విజయ్ దేవరకొండ పుట్టిన రోజును పురస్కరించుకుని.. అతడి కొత్త సినిమా పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ పోస్టర్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ష్రెడెడ్ పేపర్‌లో విజయ్ ముఖం కనిపించేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఆ పోస్టర్ స్ట్రైకింగ్‌గా, చాలా క్రియేటివ్‌గా అనిపించింది అందరికీ.

కానీ ఇంతలో దీని ఒరిజినల్ బయటికి వచ్చేసింది. 2012లో విడుదలైన ‘ఆర్గో’ అనే హాలీవుడ్ మూవీ పోస్టర్ కూడా దాదాపు ఇలాగే ఉంది. కొంచెం మార్పు అయితే చేశారు కానీ.. ఈ పోస్టర్‌కు స్పూర్తి అదే అని ఎవరైనా పసిగట్టేస్తారు. ఇంకో విషయం ఏంటంటే.. ‘ఆర్గో’ ఒక స్పై థ్రిల్లర్. విజయ్ కొత్త సినిమా కూడా స్పై థ్రిల్లరే అనే సంకేతాలను చిత్ర బృందం ఇచ్చింది.

కథ కాపీ కొట్టి ఉండకపోవచ్చు కానీ.. పోస్టర్ వరకు అయితే దాన్నుంచే స్ఫూర్తి పొందారన్నది తెలిసిపోతోంది. కానీ ఒక ఫిలిం జర్నలిస్ట్ రెండు పోస్టర్ల మధ్య సారూప్యత గురించి పోస్టు పెడితే.. నిర్మాత నాగవంశీ లైన్లోకి వచ్చాడు. తాము ఆ పోస్టర్ నుంచి ఇన్‌స్పైర్ కాలేదని.. రెండు పోస్టర్లూ ఒకలా ఉన్నాయంటే అది కోయిన్సిడెన్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. కానీ నెటిజన్లు మాత్రం ఇది జస్ట్ కవరింగ్ అని.. అది కాపీ పోస్టరే అని తీర్మానించేస్తున్నారు.