వరద సినిమాతో కోట్లు కొల్లగొడుతున్నారు

కంటెంట్ కన్నా గొప్పదేమీ లేదని అన్ని భాషల సినిమాలు ఋజువు చేస్తున్నాయి. ఎనభై కోట్లు ఖర్చు పెట్టిన యాక్షన్ మూవీకి పది కోట్లు రాకపోతే అందులో సగం కూడా బడ్జెట్ కాని హారర్ థ్రిల్లర్ ఏకంగా నలభై కోట్లు వసూలు చేస్తుంది. బాక్సాఫీస్ విచిత్రాలు ఇలాగే ఉంటాయి. తాజాగా మలయాళంలో మొన్న శుక్రవారం 2018 రిలీజయ్యింది. సంవత్సరాన్నే పేరుగా పెట్టుకుని తీశారు. కేవలం మూడే రోజుల్లో పది కోట్లకు పైగా వసూలు చేసి కేరళలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిన్న హైదరాబాద్ లో థియేటర్ల కొరత వల్ల తక్కువ స్క్రీన్లు ఇస్తే అన్నీ హౌస్ ఫుల్ కావడం గమనార్హం

ఇంతకీ ఈ సినిమాలో ఏముందనేగా మీ డౌట్. అయిదేళ్ల క్రితం కేరళను ఊపేసిన భీభత్సమైన తుఫాను వరదల గురించి మీడియాలో చూశాంగా. దర్శకుడు ఆంటోనీ జోసెఫ్ ఆ నేపధ్యాన్ని తీసుకున్నాడు. అరివిక్కులం అనే పల్లెటూరిలో కథ మొదలవుతుంది. దొంగ సర్టిఫికెట్లతో ఆర్మీ నుంచి బయటికొచ్చిన హీరో(టోవినో థామస్) స్థానికంగా జరిగే గొడవలు రాజకీయాల్లో భాగమవుతాడు. అప్పుడు అకాల వర్షం ముంచెత్తి అందరి ఇళ్ళపైకి నీరు చేరాక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పోరాటం చేయడం మొదలుపెడతారు. సముద్రంలో చేపలు పట్టేవాళ్లు, హెలికాఫ్టర్ల సహాయం ఇలా అన్నీ చేర్చారు.

ఆడియన్స్ ని ఇందులో ముఖ్యంగా ఆకట్టుకున్న అంశం కట్టిపడేసే డ్రామా. మీడియం బడ్జెట్ అయినా విజువల్స్ ని తీర్చిదిద్దిన తీరు, సంఘటనల ద్వారా అప్పటి భావోద్వేగాలను కళ్ళకు కట్టినట్టు చూపించిన విధానం ఇంకా ఆ విషాదం పచ్చిగానే ఉన్న పబ్లిక్ కి బాగా కనెక్ట్ అయిపోతోంది. ఇలాంటి డిజాస్టర్ బ్యాక్ డ్రాప్ లో మల్లువుడ్ లో గతంలోనూ సినిమాలున్నాయి కానీ మన దగ్గర తక్కువే. ఆ మధ్య శ్రేయ ప్రధాన పాత్రలో హైదరాబాద్ ఫ్లడ్స్ బ్యాక్ డ్రాప్ లో గమనం అనే మూవీ వచ్చింది కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈ 2018ని తెలుగు డబ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి