నన్ను వాడుకోవట్లేదు.. జగపతి అసంతృప్తి

హీరోగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి.. ఆ తర్వాత కెరీర్లో డౌన్ అయి.. ఒక దశలో మార్కెట్, సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడ్డాడు జగపతిబాబు. కానీ ‘లెజెండ్’ సినిమాలో విలన్ పాత్రతో ఆయన దశ తిరిగింది ఒక్కసారిగా బిజీ అయిపోయిన జగపతి.. విలన్ అనే కాక క్యారెక్టర్ రోల్స్‌తోనూ బిజీ అయిపోయాడు.

ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే బిజియెస్ట్ యాక్టర్లలో ఆయన ఒకరు. ఐతే బోలెడన్ని సినిమాలు చేస్తున్నా, డబ్బు సంపాదిస్తున్నా తనకు సంతృప్తి ఉండట్లేదని అంటున్నాడు జగపతి. సెకండ్ ఇన్నింగ్స్‌లో తనను సంతృప్తి పరిచే పాత్రలు ఎక్కువగా రావట్లేదని.. తన పాత్రలు మొనాటనస్‌గా తయారవుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పారితోషకం ఎక్కువ డిమాండ్ చేస్తానేమో అని చిన్న సినిమాలకు తనను దూరం పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.

‘‘నేనిప్పుడు హీరోను కాదు. నటుడిని. నేను డైరెక్టర్స్ యాక్టర్. కథ బాగుంటే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధం. రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు 80 క్యారెక్టర్లు చేశా. కానీ అందులో చెప్పుకోదగ్గ స్థాయివి చూస్తే ఏడెనిమిదే కనిపిస్తాయి. కొన్ని సినిమాల్లో నన్ను సరిగా వాడుకోలేదనే చెప్పాలి. సినిమాకు రిచ్‌నెస్ కావాలంటే జగపతిబాబు పెట్టేద్దాం అని నా దగ్గరికి వచ్చేస్తున్నారు. అలాంటి పాత్రలకు వీలైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. నన్ను సెట్ ప్రాపర్టీ లాగా భావించే సినిమాలు నేను చేయడం లేదు. ఇప్పుడు నాకు డబ్బు ముఖ్యం కాదు. అందుకే నచ్చని కథలు, పాత్రలకు నో చెబుతున్నా. కలర్ ఫొటో, కేరాఫ్ కంచరపాలెం, బలగం లాంటి సినిమాలు నాకు చాలా నచ్చాయి. వాటిలో నేను ఎందుకు లేనో అనే బాధ కలిగింది. నేను చిన్న సినిమాలు చేయను, వాళ్లకు నేను అందననే అభిప్రాయంలో కొందరున్నారు. అలాంటి వాళ్లు ఆ ఆలోచన మార్చుకోవాలి. నాకు ప్యాషన్ తప్ప డబ్బు ముఖ్యం కాదు. మంచి పాత్రలు ఉంటే పారితోషకం గురించి ఆలోచించకుండా నన్ను సంప్రదించవచ్చు’’ అని జగపతి అన్నాడు.