రంగం సిద్ధం చేసుకుంటున్న ఆదిపురుష్

హైప్ కన్నా ఎక్కువగా నెగటివ్ కామెంట్స్ నే మూటగట్టుకుంటున్న ఆది పురుష్ టీమ్ మెల్లగా గేరు మారుస్తోంది. టీజర్ రిలీజైన టైంలో ఎన్ని విమర్శలు వచ్చినా అసలు కంటెంట్ ని వీలైనంత ఎక్కువ మార్చకుండా చిన్న రిపేర్లతో సరిపుచ్చిన టి సిరీస్ రాబోయే రోజుల్లో ప్రమోషన్ వేగం పెంచబోతోంది. జూన్ 16 విడుదలలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. మూడు రోజుల ముందు ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో చేస్తున్న స్క్రీనింగ్స్ కు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. వందకు పైగా ప్రదర్శనకు ఉంచిన సినిమాల్లో దేనికీ ఇంత డిమాండ్ లేదని నిర్వాహకులు చెబుతున్నారు.

తెలుగు వెర్షన్ కు సంబంధించి టి సిరీస్ ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా జూన్ 3న తిరుపతి ఎస్వి గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు అనుమతుల పర్వం మొదలుపెట్టినట్టు తెలిసింది. ఆ మేరకు ప్రొడక్షన్ హౌస్ నుంచి అభ్యర్థన కూడా వెళ్లిపోయిందట. కన్ఫర్మ్ కాగానే అఫీషియల్ నోట్ వదులుతారు. రాబోయే మే 9న ట్రైలర్ లాంచ్ చేసే ఆలోచన జోరుగా జరుగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకేసారి చేసే దిశగా ప్రణాళికలు వేస్తున్నారు. చేతిలో ఉన్నది 47 రోజులే కావడంతో ఇకపై ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే.

ఇప్పుడు బజ్ ఎంత ఉన్నా రాబోయే రోజుల్లో దీన్ని అమాంతం పెంచేందుకు ఏమేం చేయాలో అన్ని జరుగుతాయట. ముందు నుంచి ఆది పురుష్ మీద ఒకరకమైన టెన్షన్ తో ఉన్న అభిమానులు ముందు కూల్ అవ్వాలంటే ట్రైలర్ అదిరిపోవాలి. అంచనాలకు మించి ఉండనే టాక్ అయితే తిరుగుతోంది. ప్రస్తుతం మారుతీ సినిమా, సలార్, ప్రాజెక్ట్ కెలతో బిజీగా ఉన్న ప్రభాస్ అది పురుష్ ప్రమోషన్ల కోసం జూన్ మొదటి వారం నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడు. దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ లతో కలిసి నాన్ స్టాప్ గా మీడియాలో కనిపించబోతున్నాడు.