వీళ్ల కష్టానికి హిట్టు పడాలబ్బా..


తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ అంతా ఒక సినిమా ఫలితం విషయంలో ఇప్పుడు తీవ్ర ఉత్కంఠతో ఉంది. ఆ సినిమానే.. ఏజెంట్. టాలీవుడ్‌కు బాగా కలిసి వచ్చిన.. ‘పోకిరి’, ‘బాహుబలి-2’ లాంటి ఇండస్ట్రీ హిట్‌లు పడ్డ ఏప్రిల్ 28ని సెంటిమెంటుగా రిలీజ్ కోసం ఎంచుకుంది ‘ఏజెంట్’ టీం. ఈ సినిమా ఆ స్థాయిలో ప్రభంజనం సృష్టించకున్నా.. అఖిల్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టేలా మంచి హిట్ అయితే చాలన్నది చిత్ర బృందం ఆకాంక్ష.

అఖిల్ అనే కాదు.. ఈ సినిమా మీద చాలామంది చాలా ఆశలతో ఉన్నారు. అందరికంటే ‘ఏజెంట్’ కోసం పెద్ద రిస్క్ చేసింది నిర్మాత అనిల్ సుంకర. అఖిల్ ట్రాక్ రికార్డు ఏమంత బాగా లేకున్నా, అతడి కెరీర్లో తొలి సక్సెస్ అయిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రూ.40 కోట్లకు అటు ఇటుగా ఆదాయం తెచ్చిపెట్టినా.. దాని మీద రెట్టింపు బడ్జెట్ పెట్టేశారు ఆయన. నాగ్ ఆయనకు వెనుక నుంచి ఏమైనా సపోర్ట్ ఇచ్చాడేమో తెలియదు కానీ.. అనిల్ చేసింది మాత్రం చాలా చాలా పెద్ద రిస్కే.

అఖిల్‌ను ఒక పెద్ద స్టార్‌లాగా ఫీలయ్యి ఏమాత్రం రాజీ లేకుండా సినిమాను నిర్మించాడు. ఇంత తపనతో సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్‌కు మంచి జరగాలనే ఎవ్వరైనా కోరుకుంటారు. ఇక హీరో అఖిల్ సినిమాలో వైల్డ్ లుక్ కోసం పడ్డ కష్టం కూడా అసాధారణమైంది. చాక్లెట్‌ బాయ్‌లా కనిపించే అఖిల్.. బీస్ట్ మోడ్‌లోకి మారేందుకు దాదాపు పది నెలలు కష్టపడ్డాడు. సినిమా కోసం ఇంత శ్రమించేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు.

ఇక ‘సైరా’ లాంటి భారీ చిత్రం తర్వాత సురేందర్ చాలా టైం తీసుకుని చేసిన సినిమా ఇది. షూటింగ్ మధ్యలో అనారోగ్యం పాలైనా.. తర్వాత కోలుకుని రాజీ పడకుండా సినిమాను పూర్తి చేశాడు. ఇక కొత్తమ్మాయి సాక్షి వైద్య కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. ఇలా ఇంతమంది కష్టపడి, సాహసోపేతంగా చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకుని అందరికీ సంతోషాన్నిస్తుందేమో చూడాలి.