టాలీవుడ్లో ఏడాది నుంచి పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండు జోరుగా నడుస్తోంది. పోకిరి మూవీతో మొదలైన ఈ హంగామా.. జల్సా, ఖుషి, చెన్నకేశవరెడ్డి, ఆరెంజ్, దేశముదురు లాంటి సినిమాలతో ఇంకో లెవెల్‌కు చేరింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సందడిలో భాగం అయ్యేందుకు భారీగానే సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇప్పటికే తారక్ సినిమాలు కొన్ని రీ రిలీజ్ అయినా.. వాటికి సరైన ప్లానింగ్, ప్రమోషన్ కొరవడింది. కానీ మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని జూనియర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సింహాద్రి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాక వరల్డ్ వైడ్ తెలుగు వాళ్లున్న చాలా చోట్ల భారీగా షోలు ప్లాన్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో అయితే సింహాద్రి షో కోసం ప్లానింగ్ మామూలుగా లేదు. విడుదలకు నెల రోజుల ముందే అక్కడ బుకింగ్స్ మొదలుపెట్టగా.. అప్పుడే ప్రి సేల్స్ ద్వారా 4 వేల డాలర్ల దాకా వసూళ్లు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా ప్రపంచంలోనే అతి పెద్దదైన ఐమాక్స్ స్క్రీన్లో సింహాద్రి 4కే షో పడుతుండటం కూడా చర్చనీయాంశం అయింది. మే 20న మెల్‌బోర్న్‌లోని భారీ ఐమాక్స్ థియేటర్లో ఈ చిత్రానికి టాలీమూవీస్ సంస్థ స్పెషల్ షో ప్లాన్ చేసింది. అంత పెద్ద స్క్రీన్‌ను 20 ఏళ్ల కిందటి సినిమాకు కేటాయించడం అంటే విశేషమే. సింహాద్రి రీ రిలీజ్ మీద భారీ అంచనాలతో ఉన్న తారక్ ఫ్యాన్స్ ఈ షో కోసం ఎగబడతారు అనడంలో సందేహం లేదు. ఆస్ట్రేలియాలోనే కాక యుఎస్, కెనడా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో సింహాద్రి స్పెషల్ షోలు భారీగానే పడనున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రీ రిలీజ్ ప్లానింగ్ గట్టిగానే ఉంది. మొత్తంగా మే 20న తారక్ ఫ్యాన్స్ హంగామా ఒక రేంజిలో ఉండబోతోందని స్పష్టమవుతోంది.