బాహుబలి సినిమా రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని విభజించి చూసేలా ఆ సినిమా అసాధారణ ఫలితం అందుకుంది, ప్రేక్షకుల మీద, అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మీద అసామాన్యమైన ప్రభావం చూపింది. ఈ సినిమాలో భాగమైన అందరి పేర్లూ మార్మోగిపోయాయి. వాళ్లకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘బాహుబలి-2’ చూసినపుడే ‘బాహుబలి-3’ కూడా వస్తే ఎంత బాగుంటుందో అన్న చర్చ నడిచింది. కానీ సీక్వెల్ ఉండదు కానీ.. బాహుబలి ప్రపంచం మాత్రం కొనసాగుతుందని రాజమౌళితో పాటు నిర్మాతలు కూడా సంకేతాలు ఇచ్చారు. ఇప్పటిదాకా అయితే ఆ ప్రపంచం తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు ఆ దిశగా సంకేతాలు వస్తున్నాయి. బాహుబలి నిర్మాతలతో ప్రభాస్ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండటమే అందుకు కారణం.
‘బాహుబలి’తో ఒకేసారి పతాక స్థాయిని అందుకున్న ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.. ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ సినిమాలు తీయలేదు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాతో సరిపెట్టారు. ఇంకేవో ప్రాజెక్టులు చేశారు. ఐతే ఇప్పుడు ఆ బేనర్లో సినిమా చేసేందుకు ప్రభాస్ డేట్లు ఇచ్చాడన్నది తాజా సమాచారం.
ఇటీవలే శోభు, ప్రసాద్‌లతో ప్రభాస్ సమావేశం అయ్యాడట. సినిమా కోసం ఒప్పందం కుర్చుకున్నాడట. ఐతే ఈ చిత్రాన్ని రాజమౌళే రూపొందిస్తాడు అనే గ్యారెంటీ అయితే లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం మహేష్ బాబు సినిమా మీదే ఉంది. ఒక సినిమా చేస్తుండగా.. వేరే చిత్రం గురించి ఆలోచించడు జక్కన్న. బాహుబలి నిర్మాతలతో ప్రభాస్ సినిమా అంటే.. అది బాహుబలి తరహాలోనే ఉండాలని, రాజమౌళే దర్శకత్వం వహించాలని ప్రేక్షకులు కోెరుకుంటారు. మరి శోభు, ప్రసాద్ ఏం ఆలోచిస్తున్నారో చూడాలి.