బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి రెండు నెలలు కావస్తోంది. కానీ దీనిపై చర్చ మాత్రం ఇంకా ఆగలేదు. పోలీసుల విచారణ కూడా కొనసాగుతోంది. ఐతే ఎవరు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా సుశాంత్‌ది ఆత్మహత్యే అని పోలీసులు అంటున్నారు. దానికి కారణాలేంటో విశ్లేషించే పని కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. సుశాంత్ చనిపోవడానికి ముందు గూగుల్‌లో సమాచారం కోసం వెతికినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడి ఫోన్, ల్యాప్ టాప్ తదితర వస్తువుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయం తెలుసుకున్నారు పోలీసులు. దీని గురించి ముంబయి పోలీసు కమిషనర్ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు సుశాంత్ చనిపోవడానికి ఐదు రోజుల ముందు అతడి మాజీ మేనేజర్ దిశా షాలిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో సుశాంత్‌కు సంబంధం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.
దీంతో అతను మనస్తాపానికి గురైనట్లు తమ విచారణలో తేలిందని సంజయ్ చెప్పారు. తాను ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు దిశ ఆత్మహత్యకు సంబంధించిన వార్తల్లో తన పేరు ఎక్కడెక్కడ ఉంది.. తన గురించి ఏం రాశారు అని సుశాంతో శోధించాడని కమిషనర్ తెలిపారు. అలాగే నొప్పిలేకుండా చనిపోవడం ఎలా? మానసిక ఒత్తిడి సమస్యలు తదితర విషయాలపై కూడా సుశాంత్ గూగుల్‌లో వెతికినట్లు ఆయన వెల్లడించారు. ఇక దిశా ఆత్మహత్య కేసుపై కమిషనర్ మాట్లాడుతూ.. దిశా చనిపోయే ముందు రోజు రాత్రి ఆమె బాయ్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ జరిగిందని.. తర్వాత తెల్లవారుజామున 3గంటలకు ఆమె ఆత్మహత్య చేసుకుందని.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ కేసు విశ్లేషించామని.. దిశా బాయ్ ఫ్రెండ్ సహా పార్టీలో పాల్గొన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని.. అందులో రాజకీయ నాయకులెవరూ లేరని ఆయన తెలిపారు. దిశ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జరిగిన పార్టీలో ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కూడా ఉన్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ దీనిపై స్పష్టత ఇచ్చారు.