గత కొన్నేళ్లలో తెలుగులో కొన్ని చిన్న సినిమాలు సంచలన విజయం సాధించాయి. మన దగ్గరా గొప్ప ప్రయోగాలు జరుగుతాయని.. బడ్జెట్ పరిమితుల గురించి పట్టించుకోకుండా కంటెంట్‌ను నమ్ముకుని అద్భుతమైన సినిమాలు అందించగలమని మన యువ దర్శకులు, రచయితలు చాటిచెప్పారు. ఈ కోవలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో గత ఏడాది విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒకటి.
కొత్త దర్శకుడు స్వరూప్‌తో కలిసి సొంతంగా స్క్ర్రిప్టు పనిలో కూడా భాగస్వామ్యం పంచుకున్న యువ నటుడు నవీన్ పొలిశెట్టి ఈ చిత్రంతో తన సత్తా ఏంటో చూపించాడు. కథ లోకలే కానీ.. ఈ సినిమా రీచ్ మాత్రం అంతర్జాతీయ స్థాయిది. చూసిన ప్రతి తెలుగు ప్రేక్షకుడూ వావ్ అనుకుని కాలర్ ఎగరేసేలా తెరకెక్కిందీ చిత్రం. దీన్ని ఒక ఫ్రాంఛైజీలా చేయడానికి అవకాశముందని సినిమా చూసిన వాళ్లకు అర్థమైంది.
చిత్ర బృందం కూడా ఈ దిశగా ఇంతకుముందే సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ‘ఏజెంట్’ నిర్మాత దీని సీక్వెల్స్ గురించి స్వయంగా ప్రకటించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు కనీసం మరో రెండు సీక్వెల్స్ తీస్తామని అతను వెల్లడించాడు. ముందు తొలి సీక్వెల్ కోసం సన్నాహాలు మొదలుపెడుతున్నామని.. త్వరలోనే ప్రకటన ఉంటుందని తెలిపాడు.
మన ఏజెంట్ ఛేదించడానికి మరి కొన్ని కేసులు సిద్ధమవుతున్నాయని అతనన్నాడు. మరోవైపు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ను జపనీస్‌తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోకి అనువాదం చేయబోతుండటం విశేషం. బాలీవుడ్లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి కథలో బలం ఉండాలే కానీ.. బడ్జెట్, కాస్టింగ్, టెక్నీషియన్స్ ఏ స్థాయి అన్నది సంబంధం మంచి ఫలితాన్ని అందుకోవచ్చనడానికి ‘ఏజెంట్’ ఉదాహరణ అనడంలో సందేహం లేదు.