‘శాకుంతలం’ చూసి ‘ఆదిపురుష్’ టీంలో భయం

Adipurush
Adipurush

చారిత్రక నేపథ్యం, గ్రాఫిక్ కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఎగబడి థియేటర్లకు వచ్చేస్తారన్న భ్రమల్ని ‘శాకుంతలం’ తొలగించేసింది. ఏకంగా రూ.50 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాభవాన్ని చవిచూసింది. వీకెండ్లోనే ఈ సినిమా థియేటర్లలో జనాలు లేరు. కనీసం పది కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేని దయనీయ స్థితిని ఎదుర్కొంది.

గుణశేఖర్ పట్ల సానుకూల భావన ఉన్నప్పటికీ, ఈ సినిమా అతను భారీ బడ్జెట్ పెట్టేశాడే, చాలా కష్టపడ్డాడే అనే సానుభూతి కూడా వ్యక్తమైనప్పటికీ.. థియేటర్లకు వెళ్లి సినిమా చూసే సాహసం మాత్రం మెజారిటీ ప్రేక్షకులు చేయలేకపోయారు. సినిమాలో ప్రధాన పాత్రల పట్ల ప్రేక్షకుల్లో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడకపోవడం.. పాత్రలు సహజంగా అనిపించకపోవడం.. సెట్టింగ్స్, గ్రాఫిక్స్ ఏమాత్రం ఆకట్టుకోకపోవడం.. అవి కృత్రిమంగా అనిపించడం ఈ సినిమా పరాజయానికి ప్రధాన కారణాలు.

ఐతే ‘శాకుంతలం’ మీద వచ్చిన సమీక్షలు.. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూశాక ‘ఆదిపురుష్’ టీం కంగారు పడుతుంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ‘శాకుంతలం’లో ఉన్న బలహీనతలన్నీ ‘ఆదిపురుష్’లో కూడా ఉన్నాయనే ఫీలింగ్ ఇప్పటికే జనాల్లో ఉంది. ఆ సినిమా టీజర్‌కే జనాలు తట్టుకోలేకపోయారు. దాని మీద జరిగిన ట్రోలింగ్ మరే సినిమా టీజర్ మీదా జరగలేదు. దెబ్బకు సినిమానే వాయిదా వేసుకుని విజువల్ ఎఫెక్ట్స్, ఇతర అంశాల మీద మళ్లీ వర్క్ చేస్తోంది టీం.

కానీ గ్రాఫిక్స్ విషయంలో కొంచెం కరెక్షన్లయితే చేయగలరు కానీ.. మొత్తంగా సినిమా లుక్ మార్చలేరు కదా? కాబట్టి ఔట్ పుట్ ఎలా ఉంటుందో అన్న భయం ప్రభాస్ అభిమానులను వెంటాడుతోంది. చారిత్రక కథలను తెరపై సరిగ్గా ప్రెజెంట్ చేస్తే అద్భుతాలు చేస్తాయి. అదే సమయంలో కొంచెం అటు ఇటు అయితే ఎంత దారుణమైన ఫలితాలు ఎదురవుతాయో ‘శాకుంతలం’ చూపించింది. మరి ‘ఆదిపురుష్’ సినిమా ఇందులో ఏ కేటగిరీలోకి వెళ్తుందో చూడాలి.