కోలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా చెన్నై మీడియా తెగ పొగిడేస్తున్న సూర్య 42వ చిత్రానికి కంగువ టైటిల్ ని ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు. పది భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్లానింగ్ లో ఉన్నారు. 2024 సంక్రాంతి విడుదల దాదాపు ఖరారు చేసుకున్నారు కానీ రేస్ లో ఇండియన్ 2, ప్రాజెక్ట్ కె, మహేష్ బాబు 28లు ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఇవన్నీ వచ్చే పనైతే వాటితో క్లాష్ కావాలా వద్దానే నిర్ణయం త్వరలో తీసుకోబోతున్నారు. తెలుగుతో సహా అన్ని లాంగ్వేజెస్ లోనూ కంగువ పేరుతోనే ప్రమోషన్లు చేయబోతున్నారు.
ఈ పదానికి అర్థం అగ్నిలక్షణాలు ఉన్నవాడు, అనుకున్న లక్ష్యం కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగట్టేవాడు. పోస్టర్ లో గుడ్లగూబ, గద్ద పోలికలతో ఉన్న భారీ పక్షి ఆకారాన్ని రివీల్ చేసిన టీమ్ సూర్య లుక్ మాత్రం ఓపెన్ చేయలేదు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో వివిధ కాలాలకు సంబంధించి సూర్య వెరైటీ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఇంత భారీ ప్రాజెక్టుకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం విశేషం. దర్శకుడు సిరుతై శివ తన రెగ్యులర్ కమర్షియల్ మాస్ కి భిన్నంగా ఈసారి పెద్ద ప్రయోగమే చేస్తున్నాడని అర్థమవుతోంది.
సరే తమిళ టైటిల్స్ తెలుగులోనూ యథావిధిగా పెట్టడం ఈ మధ్య ట్రెండ్ గా మారిపోయింది. తలైవి, వలిమై అంటూ ఆ పదాలకు అర్థం టాలీవుడ్ జనాలకు అర్థం కాకపోయినా వాటినే పెడుతున్నారు. ఇప్పుడు కంగువకు అదే ఫాలో అవుతున్నారు. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాతో సూర్య థియేట్రికల్ మార్కెట్ అమాంతం పెరుగుతుందనే అంచనాలు కోలీవుడ్ లో బలంగా ఉన్నాయి. కాకపోతే సోలోగా బరిలో దిగేందుకు ఇష్టపడుతున్న సూర్య బృందానికి డేట్ దొరకడం ఇబ్బందిగా మారింది. లేదూ తప్పదనుకుంటే పొంగల్ బరిలోనే దిగుతారు.