తమిళ సినిమాలంటే ఒకప్పుడు చాలా కొత్తగా ఉండేవి. అక్కడ రకరకాల ప్రయోగాలు జరిగేవి. అక్కడ్నుంచి డబ్ అయి వచ్చే సినిమాలను మనవాళ్లు ఎగబడి చూసేవాళ్లు. ఇలాంటి సినిమాలు మన దగ్గర రావట్లేదేంటి అని ఫీలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో మారింది. మన దగ్గరే ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా తమిళ సినిమాల క్వాలిటీ దారునంగా పడిపోయి. స్టార్ హీరోలు సహా అందరూ అక్కడ రొటీన్ మసాలా సినిమాలు చేసుకుంటూ గడిపేస్తున్నారు.
ఈ సంక్రాంతికి రిలీజైన విజయ్, అజిత్ సినిమాలు వారిసు, తునివు కూడా రొటీన్ సినిమాలే అన్న సంగతి తెలిసిందే. వాళ్లే అలాంటి సినిమాలు చేస్తే ఇక లారెన్స్ ఎలాంటి సినిమాలు చేస్తాడో అంచనా వేయొచ్చు. మామూలుగానే అతను రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు చేస్తుంటాడు. ఇప్పుడు రుద్రుడు పేరుతో వచ్చిన లారెన్స్ కొత్త సినిమా చూస్తే మాస్ ప్రేక్షకులకు సైతం దిమ్మదిరిగి బొమ్మ కనబడటం ఖాయం.
ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత దారుణమైన హింసాత్మక చిత్రంగా రుద్రుడును చెప్పొచ్చు. పేరుకేమో ఇందులో హీరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కానీ తన ప్రతీకారంలో భాగంలో పదుల సంఖ్యలో తలలు తెగ్గొడుతుంటాడు. కథలో అసలు ఎమోషన్ అంటూ ఏమీ లేకుండా విపరీతమైన ఫైట్లతో సినిమాను నింపేశాడు దర్శకుడు. లారెన్స్‌తో ఇంత వయొలెంట్ సినిమా తీయాలని దర్శకుడికి ఎందుకు అనిపించిందో ఏమో?
ఇక సినిమాలో ప్రియా భవాని శంకర్ లాంటి అందమైన కథానాయిక పక్కన లారెన్స్ అస్సలు సూట్ కాలేదు. ఆమెతో రొమాంటిక్ సన్నివేశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సెంటిమెంట్ సీన్లయితే మరీ హద్దులు దాటిపోయి కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్తాయి. లారెన్స్ సహా నటీనటులంతా అవసరానికి మించి నటించేసి ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేశారు. రొటీన్ మాస్ సినిమాలను ఇష్టపడేవారు కూడా హాహాకారాలు చేసేలా ఉన్న రుద్రుడు.. ప్రేక్షకులతో లిటరల్‌గా ఫుట్‌బాల్ ఆడేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. పొరపాటున కూడా ఈ సినిమా థియేటర్ల వైపు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు చూసిన వాళ్లు.