హనుమంతుడి స్ఫూర్తితో రాజమౌళి 13

ఆర్ఆర్ఆర్ సందడికి శుభం కార్డు పడింది. ఆస్కార్ వచ్చేసింది. సత్కారాలు సంబరాలు అయిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. రాజమౌళి రిలాక్స్ అవుతున్నారు. కీరవాణికి ఇప్పటికిప్పుడు వచ్చిన టెన్షన్ ఏమి లేదు. ఎటొచ్చి మహేష్ బాబు అభిమానులే తమ హీరో స్క్రిప్ట్ ఎలా ఉంటుందోనని ఏదైనా లీక్ రాకపోదాని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంత కాలం క్రితమే రచయిత విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తూ అటవీ నేపథ్యంలో ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుందని క్లూ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో టాక్ హైప్ ని పెంచుతోంది. ఇందులో హీరో పాత్రను హనుమంతుడి స్ఫూర్తితో రాస్తున్నారట. అంటే తన బలం తనకే తెలియకుండా ఉంటూ అవసరమైనప్పుడు ఎంతటి సాహసమైనా చేసి విజయం సాధించేలా ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ తో డిజైన్ చేస్తున్నారట. అంటే గతంలో మహేష్ ఎన్నడూ చేయని రీతిలో ఛాలెంజింగ్ గా ఉంటుందట. మొదట అమాయకుడి షేడ్స్ చూపిస్తూనే క్రమంగా కథ ముందుకు వెళ్లేకొద్దీ పాత్ర స్వభావంలో మార్పులు వచ్చేలా సెట్ చేశారని వినికిడి. ఇంకా ఫైనల్ వెర్షన్ ఫినిష్ కాలేదు కానీ ఇదంతా ప్రాధమిక సమాచారమే.

మూడు భాగాలుగా ఇది రూపొందుతోందనే వార్తకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. నిజమా కాదాని ధృవీకరణ రావడానికి టైం పడుతుంది. అతి త్వరలో కీరవాణి ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించబోతున్నారు. లిరిక్స్ అన్నీ చంద్రబోసే రాసే అవకాశం ఎక్కువగా ఉంది. మహేష్ అవతల త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు పూర్తి చేసి వచ్చేలోపు ఇక్కడ వర్క్ షాప్ తాలూకు పనులన్నీ పూర్తి చేస్తారు. క్యాస్టింగ్ మొత్తంతో ట్రైనింగ్ అయ్యాక ఓపెనింగ్ ఎప్పుడు చేయాలనేది డిసైడ్ చేస్తారు. ఇదంతా జరగడానికి సులభంగా ఆరేడు నెలలకు పైగానే టైం పట్టేలా ఉంది.