పుష్ప రాజ్ తిరిగి వచ్చాడు

ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు మోస్తున్న సినిమాల్లో పుష్ప 2 ది రూల్ మొదటి స్థానంలో ఉంది. ఫస్ట్ పార్ట్ ఉత్తరాదిలోనూ బ్లాక్ బస్టర్ కావడంతో దేశవ్యాప్తంగా క్రేజ్ మాములుగా లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే సుకుమార్ స్క్రిప్ట్ దగ్గరి నుంచి మేకింగ్ దాకా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దానికి తగ్గట్టే ఇవాళ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ లో మూవీ కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పే ప్రయత్నం చేశారు. హైప్ ఏ స్థాయిలో ఉందో గుర్తు పెట్టుకుని దానికి మ్యాచ్ అయ్యేలా సుక్కు బృందం తీసుకున్న జాగ్రత్తలు కనిపించాయి

పుష్ప తిరుపతి జైలు నుంచి రక్తపు గాయాలతో తప్పించుకుంటాడు. పోలీసులు శేషాచలం అడవుల్లో వేట మొదలుపెడతారు. ఒక కొండ మీద అతని చొక్కా దాని మీద ఎనిమిది బులెట్ ఆనవాళ్లు కనిపిస్తాయి. దీంతో పుష్ప చనిపోయాడనే పుకారుతో చిత్తూరు ప్రాంతం మారుమ్రోగిపోతుంది. అతని సాయం పొందినవాళ్లంతా రోడ్ల మీదకొచ్చి నిరసనలు వ్యక్తం చేస్తారు. అల్లర్లు చెలరేగుతాయి. పులులను పట్టుకోవడం కోసం ఏర్పాటు చేసిన సిసి కెమెరాల్లో దుప్పటి కప్పుకుని పులినే అదిలించే కంటి చూపుతో పుష్ప రాజ్ కనిపిస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది అరాచకం

పుష్ప 2 ది రూల్ కి ఏం కావాలో అంతా దిట్టంగా సమకూర్చినట్టే కనిపిస్తోంది. గ్రాండియర్, విజువల్స్, ప్రొడక్షన్ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి అనేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. బన్నీని చూపించింది కేవలం రెండు షాట్లలోనే అయినా ఫ్యాన్స్ కి కావాల్సిన గూస్ బంప్స్ ఇందులో ఇచ్చేశారు. ఇది ఇంకా అసలైన టీజర్ ట్రైలర్ కాదు కాబట్టి వాటిలో అసలు కంటెంట్ ఉండొచ్చు. విడుదల తేదీ కోసం ఎదురు చూసిన ప్రేక్షకులను ప్రస్తుతానికి నిరాశ పరుస్తూ డేట్ ని మాత్రం సస్పెన్స్ లో పెట్టి బర్త్ డే విషెస్ చెప్పారు