ఒకే కాన్సెప్ట్ తో వేల కోట్లు లాగేస్తున్నారు

హాలీవుడ్ లో మార్వెల్, డిస్నీ, యునివర్సల్ లాంటి ప్రొడక్షన్ కంపెనీలు ఒక కాన్సెప్ట్ ని ఫ్రాంచైజీలాగా మార్చి దాని మీద సంవత్సరాల తరబడి వరసగా సినిమాలు తీస్తూ లక్షల కోట్లు ఆర్జిస్తారు. ఉదాహరణకు స్పైడర్ మ్యాన్, జురాసిక్ పార్క్, బ్యాట్ మ్యాన్, అవెంజర్స్ లాంటివి. ఏ భాగం చూసినా మూలకథ దాదాపుగా ఒకటే అనిపిస్తుంది. పెట్టే ఖర్చు, విజువల్ ఎఫెక్ట్స్ లో తేడా ఉంటుంది అంతే. ఇప్పుడు హిందీలోనూ యష్ రాజ్ ఫిలింస్ స్పై జానర్ ని అచ్చం ఇలాగే కామధేనువుగా మార్చుకుంటోంది. కథానాయకుడు విలన్ ఇద్దరినీ గూఢచారులుగా పెట్టి జస్ట్ హీరోలను మార్చేసి బాక్సాఫీస్ ని కొల్లగొడుతోంది.

వార్ లో హృతిక్ రోషన్ పాత్రనే సిద్దార్థ్ ఆనంద్ కొంచెం అటుఇటుగా మార్చి పఠాన్ లో జాన్ అబ్రహంగా సెట్ చేశాడు. ఎక్ థా టైగర్, టైగర్ జిందా హైలో చాలా సారూప్యతలు కనిపిస్తాయి. రాబోయే టైగర్ 3లోనూ ఇలాంటి బ్యాక్ డ్రాపే ఉంటుంది. ఇది చాలదన్నట్టు టైగర్ vs పఠాన్ అంటూ ఏకంగా సల్మాన్ షారుఖ్ లతో కనివిని ఎరుగని స్థాయిలో భారీ యాక్షన్ థ్రిల్లర్ ని ప్లాన్ చేసింది. ఇవాళ వార్తల్లోకి వచ్చిన హృతిక్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలోని వార్ 2 సైతం ఇదే క్యాటగిరీలో వస్తుంది. స్టోరీ లైన్ లో మార్పులు ఉంటాయి కానీ నమ్మశక్యం కాని ఫైట్లతో మాస్ ని మెప్పించడమే వీటి పని.

యాష్ బ్యానర్ అధినేత ఆదిత్య చోప్రా ఇలా చేయడం ఇదేమి కొత్త కాదు. గతంలో ధూమ్ ని తీసుకొచ్చి మూడు భాగాలు చేసి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇవన్నీ లెక్కేసుకుని చూస్తే సుమారుగా ఆరేడు వేల కోట్ల టర్నోవర్ ని ఒక్క స్పై సబ్జెక్టుతోనే పిండుకున్న విషయం అర్థమైపోతుంది. దీన్ని ఇక్కడితో ఆపరట. ఆడియన్స్ ని బోర్ కొట్టేసి ఇక చాలు బాబోయ్ అనేదాకా, హీరోలు రొటీనని ఫీలయ్యే దాకా వస్తూనే ఉంటాయి. సౌత్ మార్కెట్ ని లక్ష్యంగా చేసుకుని తారక్ లాంటి స్టార్లను ఈ స్పై యూనివర్స్ లోకి తీసుకొస్తున్నారు. చూస్తుంటే ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు.