ఐపీఎల్ దెబ్బ గట్టిగా తగులుతోంది

బాక్సాఫీస్ మీద ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల దెబ్బ గట్టిగానే పడుతోంది. మార్చి 31న ప్రారంభమైన ఈ మెగా స్పోర్ట్స్ మేళాను అభిమానులు ఎగబడి చూస్తున్నారు. ఫలితంగా ఈ ప్రభావం నేరుగా థియేటర్ల మీద చూపిస్తోంది. మొదటి నాలుగు రోజు ధూమ్ ధామ్ దోస్తాన్ అంటూ వసూళ్లతో చెడుగుడు ఆడిన దసరా హఠాత్తుగా సోమవారం నుంచి సాధారణంగా ఉండాల్సిన డ్రాప్ కంటే ఎక్కువ చూపించడం దీని వల్లేనని ట్రేడ్ విశ్లేషణ. ఐపిఎల్ ని జియో సినిమా యాప్ ఉచితంగా ఫోర్ కె రిజొల్యూషన్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. పైసా కట్టకుండా ఎంజాయ్ చేయొచ్చు.

దీంతో రోజువారీ ఆటలను చూసే సంఖ్య విపరీతంగా ఉంటోంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి జట్లు ఆడుతున్నప్పుడు సగటు కనీసం కోటికి పైగా ఆన్ లైన్ వ్యూస్ ఉంటున్నాయి. అక్కడే కాదు గ్రౌండ్లు సైతం జనంతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. వారం ముందే టికెట్లు సోల్డ్ అవుట్ కావడం కంటే ఉదాహరణ ఇంకేం కావాలి. ఒకవేళ ఇది లేకపోతే దసరా ఈపాటికే వంద కోట్ల గ్రాస్ ని సులభంగా దాటేసేది. ప్రస్తుతం 92 దగ్గర ఉంది. ఈ వీకెండ్ అవ్వగానే క్రాస్ చేయడం లాంఛనమే. దసరా కాకుండా మిగిలినవన్నీ డెఫిషిట్ లోనే నడుస్తున్నాయి.

ఇంకో ఇరవై రోజులకు పైగా ఐపిఎల్ కొనసాగనుంది. ఒకవేళ పైన చెప్పిన మూడు నాలుగు జట్లు కనక మంచి పెరఫార్మాన్స్ చూపించి సెమి ఫైనల్స్ దాకా వెళ్లగలిగితే అప్పుడు కలెక్షన్లకు ఇంకొంత గడ్డుకాలం తప్పదు. అసలే బయట విపరీతమైన ఎండలు. దీనికి తోడు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. దాంతో సహజంగానే సినిమాల పట్ల ఆసక్తి తక్కువగానే కనిపిస్తోంది. రవితేజ లాంటి స్టార్ హీరో నటించిన రావణాసుర బుకింగ్స్ సైతం చాలా నెమ్మదిగా ఉన్నాయి. దీన్ని బట్టే పరిస్థితుల ప్రభావం టికెట్ కౌంటర్ల మీద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.