ఇలాంటి నటుడు ఒక్కడే ఉంటాడు

టాలీవుడ్ ఈ రోజు ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన పేరు.. కాస్ట్యూమ్స్ కృష్ణ. ఈ తరం ప్రేక్షకులకు ఈ పేరు విన్న గుర్తు కూడా ఉండకపోవచ్చు. నిన్నటితరం ప్రేక్షకులు కూడా ఈ పేరు విని దశాబ్దాలు అయిపోయి ఉండొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటులు ఎవరు అంటే ఆయన పేరు ఎవరికీ తట్టకపోవచ్చు. కానీ ఆయనొక లెజెండరీ నటుడనడంలో సందేహం లేదు. నిజానికి కాస్ట్యూమ్స్ కృష్ణ బేసిగ్గా నటుడు కాదు.

ఆయన కాస్ట్యూమ్ డిజైనర్‌గానే ఇండస్ట్రీలో పాపులర్. 80వ దశకంలో చాలామంది అగ్ర కథానాయకులకు ఆయన కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. కాస్ట్యూమ్స్ అనే టైటిల్ కింద కృష్ణ అనే పేరు చాలా సినిమాల్లో కనిపించేది. అలా ‘కాస్ట్యూమ్స్’ అనే మాటను తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. కృష్ణలో మంచి నటుడు ఉన్న విషయం లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ గుర్తించారు.

తన ‘భారత్ బంద్’ సినిమాతో కృష్ణను నటుడిగా పరిచయం చేశారు కోడి రామకృష్ణ. తెలుగులో వచ్చిన బెస్ట్ పొలిటికల్ డ్రామాల్లో ఈ సినిమా ఒకటి. ఇప్పుడు చూసినా టెర్రిఫిగ్గా అనిపించే ఈ చిత్రంలో కృష్ణ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడ్డానికి కమెడియన్‌ లాగా కనిపిస్తాడు కానీ.. ఆ సినిమాలో విలనీని పండించిన తీరు అసాధారణం. ఆ తర్వాత ‘పెళ్ళాం చెబితే వినాలి’ సహా పలు చిత్రాల్లో నెగెటివ్ క్యారెక్టర్లతో కృష్ణ ఆకట్టుకున్నారు.

రావు గోపాల్రావు తరహాలోనే విలనీలోనూ కామెడీ పండించడం ఆయన ప్రత్యేకత. కృష్ణ నటన లాగే ఆయన వాయిస్, డైలాగ్ డెలివరీ కూడా భిన్నంగా ఉంటాయి. అందుకే ఆయన చాలా ప్రత్యేకంగా అనిపిస్తారు. ఇంకెవరితోనూ పోల్చలేని విలక్షణ నటుడు ఆయన. కాస్ట్యూమ్స్ కృష్ణ నటుడే కాదు.. నిర్మాత కూడా ‘పెళ్ళిపందిరి’ సహా కొన్ని చిత్రాలను ఆయన నిర్మించారు. ఐతే 90వ దశకం చివర్లో సినిమాలకు దూరం అయిన కృష్ణ.. తర్వాత ఎప్పుడూ ఇండస్ట్రీలో కనిపించలేదు. తాను స్థిరపడ్డ చెన్నైకే పరిమితం అయ్యారు. అక్కడే తుది శ్వాస విడిచారు.