30 ఏళ్ల తరువాత ఆయనకు మంత్రి పదవి దక్కనుందా

వైసీపీ నుంచి ముగ్గుర రెడ్లు.. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిలను బయటకు పంపించడం.. ఆ ముగ్గురూ నెల్లూరు జిల్లాకే చెందినవారు కావడంతో ఆ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. జిల్లాలో లెక్కలు మారడమే కాకుండా రెడ్డి కులంలోనూ ఈక్వేషన్లను చెదురుతున్నాయని గ్రహించిన జగన్ రెడ్డి నష్టనివారణకు దిగినట్లు తెలుస్తోంది.

పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ముగ్గురు రెడ్లలో ఎవరూ మంత్రులు కానప్పటికీ… ఇప్పుడు మరో రెడ్డికి నెల్లూరు జిల్లా నుంచి మంత్రి పదవి ఇచ్చి లెక్క సరిచేయాలని జగన్ అనుకుంటున్నారట. ఆయన ఇంకెవరో కాదు… నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నిజానికి ప్రసన్న కూడా గతంలో జగన్‌ను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తే. అయితే, కొంతకాలంగా ఆయన సైలెంటుగా ఉంటున్నారు.

మొన్న ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేల తిరుగుబాటు తరువాత ప్రసన్న కూడా పార్టీ మారుతారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ, ఆయన దాన్ని ఖండిస్తూ వచ్చారు. చివరి వరకు జగన్‌తోనే ఉంటానని.. తాను మరణించిన తరువాత కూడా తన కుమారుడు కూడా జగన్‌తోనే ఉంటారంటూ ఆయన సెంటిమెంట్ పండించారు.

ఈ సెంటిమెంట్ల సంగతి ఎలా ఉన్నా… నెల్లూరు జిల్లాలో బలమైన రెడ్డి కుటుంబానికి చెందిన ఆనం, అలాగే మేకపాటిలు.. వారితో పాటు దూకుడు స్వభావం గల రెడ్డి నేత కోటంరెడ్డి పార్టీకి దూరమవడంతో అది కేవలం పార్టీ వ్యవహారంగా కాకుండా రెడ్లకు కూడా వైసీపీలో న్యాయం జరగడం లేదు.. పార్టీలోని రెడ్లు అసంతృప్తిగా ఉన్నారన్న మెసేజ్ ఒకటి ఆ వర్గంలో బలంగా చొచ్చుకుపోయింది. ఈ విషయం గ్రహించిన జగన్.. రెడ్లను ఊరడించేందుకు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రసన్నకు అలాంటి సంకేతాలో, సమాచారమో అందడంతోనే ఆయన రూటు మారుస్తున్నారని.. విధేయత చాటుకునేలా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్తున్నారు. మరి… జగన్ ఊరించి ఉసూరుమనిపిస్తారో.. మంత్రి పదవి ఇచ్చి 30 ఏళ్ల గ్యాప్ తీరుస్తారో చూడాలి. ప్రసన్నకుమార్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవిలో ఉన్నది చాలా తక్కువ కాలం. 1994లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయన వాణిజ్య, చక్కెర కర్మాగారాల మంత్రిగా కొద్దికాలం పనిచేశారు. ఆ తరువాత ఆయనకు మళ్లీ మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడు జగన్‌పై ఆయన ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.