దసరా ట్విస్టు – బరిలో టైగర్ నాగేశ్వరరావు

ఇంకా ఏడు నెలల సమయం ఉండగానే దసరా పోటీ రసవత్తరంగా మారుతోంది. ఇప్పుడు రిజర్వ్ చేసుకోకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని గుర్తించిన దర్శక నిర్మాతలు ముందస్తుగా అధికారిక ప్రకటనలు ఇస్తున్నారు. ఇటీవలే రామ్ – బోయపాటి శీనుల కాంబోలో రూపొందుతున్న సినిమా అక్టోబర్ 20న విడుదలవుతుందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మాస్ మహారాజా రవితేజ సైతం అదే రోజు టైగర్ నాగేశ్వరరావుగా వస్తున్నానంటూ అఫీషియల్ గా చెప్పేశాడు. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక దొంగకు సంబంధించిన రియల్ బయోపిక్. కొన్ని దశాబ్దాల క్రితం స్టువర్ట్ పురంలో నాగేశ్వరరావు అనే దొంగ పోలీసులను ప్రభుత్వాలను గజగజ వణికించాడు. ఉన్నోడిది కొల్లగొట్టు లేనోడికి పంచిపెట్టు అనే రాబిన్ హుడ్ సూత్రంతో లెక్కలేనన్ని దొంగతనాలకు పాల్పడ్డాడు.

ఈయన గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముందు రానాతో చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఈ స్టోరీ నాదేనంటూ కొంత హడావిడి చేశాడు. తర్వాత తప్పుకున్నాడు. ఫైనల్ గా రవితేజకు ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే కీలక భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ థీఫ్ డ్రామాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం.

ఇప్పుడు దసరా బరిలో అధికారికంగా రామ్, రవితేజలతో పాటు తమిళ హీరో విజయ్ తన లియోతో ఉన్నాడు. బాలకృష్ణ అనిల్ రావిపూడిది కూడా అదే సీజన్ ని లక్ష్యంగా పెట్టుకుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకెలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాలి. సమయం చాలా ఉన్నప్పటికీ చెప్పినవాళ్లంతా ఖచ్చితంగా అదే డేట్ కి కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ లేదు కానీ రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి చూడాలి. వాల్తేరు వీరయ్య, రావణాసుర తర్వాత 2023లో రిలీజవుతున్న రవితేజ మూడో సినిమా ఇది.