కొన్ని డిజాస్టర్లను తేలికగా తీసుకుంటాం కానీ వాటిలో ఉన్న నిజాయితీ ఎందరినో ప్రభావితం చేసి జీవితాలను మార్చేస్తుంది. సుకుమార్ తీసిన జగడం అలాంటి వాటిలో ముందు వరసలో ఉంటుంది. ఈ వారం విడుదల కాబోతున్న దసరా దర్శకుడు శ్రీకాంత ఓదెల ప్రస్థానం దీంతో స్ఫూర్తి చెందడం వల్లే మొదలయ్యిందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇతన్ని బాగా ప్రభావితం చేసిన సినిమా ఇదే.
ఇందులో టేకింగ్, కథను చెప్పిన విధానం చూసి షాక్ తిన్న శ్రీకాంత్ ఓదెల ఒక్క జగడం ద్వారానే వంద చిత్రాలకు సరిపడా పనితనాన్ని నేర్చుకున్నంతగా గొప్ప ప్రేరణనిచ్చింది. ఆ సమయంలో బికాం చదువుతున్న శ్రీకాంత్ డిగ్రీ అందుకున్న వెంటనే పరిశ్రమకు వచ్చేయాలన్న సంకల్పంతో నేరుగా సుకుమార్ ఆఫీస్ కే వెళ్ళిపోయాడు. రోజులు నెలలు కాదు ఏకంగా రెండు సంవత్సరాలు ఆయన చుట్టూ తిరిగాడు.
చివరికి ఆ పట్టుదల గమనించిన సుక్కు ఒక షార్ట్ ఫిలిం తీసుకు రమ్మని పురమాయించడం, శ్రీకాంత్ ఓదెల వెంటనే ఆ పని పూర్తి చేసి మెప్పించడంతో ఎట్టకేలకు ఆ బృందంలోకి అడుగు పెట్టగలిగాడు. నాన్నకు ప్రేమతో నుంచి రంగస్థలం దాకా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో గురువు దగ్గరే ఉన్నాడు. అందుకే ఆ ప్రభావం తన మేకింగ్ లో కనిపిస్తుంది. గతంలో ఓ సందర్భంలో రాజమౌళి సైతం జగడంలో ఇంట్రో సీన్ తనకు చాలా ఇష్టమని సుకుమార్ కనక మాస్ సినిమా తీస్తే తమకు చాలా ఇబ్బందవుతుందని ఎన్నో ఏళ్ళ క్రితం చెప్పాడు.
తర్వాత అదే నిజమయ్యింది. రిలీజై పదహారేళ్లవుతున్నా జగడం ఇప్పటికీ ఒక రిఫరెన్స్ గా ఉండిపోవడం షాకింగ్ గా అనిపించే విషయం. లేలేతగా కనిపించే రామ్ ని అంత బరువైన రౌడీ షీటర్ పాత్రకు ఎంచుకోవడం, సెకండ్ హాఫ్ లో జరిగిన కొన్ని తడబాట్లు జగడంని డిజాస్టర్ చేశాయి. ఫలితం సంగతి ఎలా ఉన్నా జగడం ఫిలిం మేకర్స్ కి ఇన్స్పిరేషన్ ఇవ్వడం అనూహ్యమే.