బ్రహ్మానందం ‘చక్రి’ ఎలా అయ్యాడు?


నాలుగు దశాబ్దాల కెరీర్లో 99.9 శాతం నవ్వులు పంచే పాత్రలే చేశాడు బ్రహ్మానందం. ఆయన పేరు ఎత్తితే అందరి ముఖాల్లో చిరునవ్వు పులుముకుంటుంది. 80వ దశకంలోని యువ ప్రేక్షకులు మొదలుకుని.. ఇప్పటి యూత్‌కు కూడా కనెక్ట్ అవుతూ నవ్వించగలగడం బ్రహ్మికే చెల్లు.

ఐతే కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయిపోవడం వల్ల బ్రహ్మిలోని మిగతా కోణాలు జనాలకు తెలియలేదు. ఆయన సెంటిమెంటను కూడా అద్భుతంగా పండించగలరని ‘బాబాయ్ హోటల్’ లాంటి సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత దాన్ని మించి గొప్పగా సెంటిమెంటును పండించి చూసిన ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించేశాడు బ్రహ్మి ‘రంగమార్తాండ’ సినిమాలో. ఈ సినిమాలో బ్రహ్మి చేసిన చక్రి పాత్ర ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

ఐతే కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన బ్రహ్మితో చక్రి పాత్రను చేయించాలన్న ఆలోచన చేసిన కృష్ణవంశీ అభినందనీయుడు. ఆయనకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందన్నదే ఆశ్చర్యకరం. దీని గురించి మీడియాతో మాట్లాడాడు ఈ సీనియర్ డైరెక్టర్.

“ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ లాంటి నటుడిని పట్టుకుని నువ్వు చెత్త నటుడివి అనాలన్నా, చెంపదెబ్బ కొట్టాలన్నా ఆ స్థాయి ఉన్న నటుడు కావాలి. అలాగే ఆ పాత్ర ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ లాగా ఉండాలి. వీటన్నింటికీ న్యాయం చేసేది ఎవరు అనగానే నా మదిలో మెదిలిన రూపం బ్రహ్మానందందే. నాకు ఆ ఆలోచన రాగానే ప్రకాష్ రాజ్‌కు చెప్పా. ఆయన కూడా అదే కరెక్ట్ అన్నారు. ఈ చిత్రంలో వచ్చే ఆసుపత్రి సన్నివేశాన్ని మూడు నెలల పాటు బ్రహ్మానందం బట్టీ పట్టాడు. ప్రకాష్‌ను చెంపదెబ్బ కొట్టే సన్నివేశంలో నీరసంగా కనిపించడం కోసం భోజనం కూడా మానేశారు. ఈ పాత్ర మీద ఆయన పెట్టిన శ్రద్ధ అసాధారణమైంది” అని కృష్ణవంశీ చెప్పాడు.