సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం థియేటర్లు ఆర్ఆర్ఆర్ జ్వరంతో ఊగిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల తొలి కలయికకు అభిమానులు వెర్రెత్తిపోయారు. రాజమౌళి కన్న కలకు గత పన్నెండు నెలలుగా ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. స్వప్నంలో ఉండిపోతుందేమోనన్న తెలుగు వాడి ఆకాంక్షను నిజం చేస్తూ నాటు నాటు పాటకు గాను ఏకంగా ఆస్కార్ అందుకుని టాలీవుడ్ విజయ పతాకను ప్రపంచ వినువీధుల్లో సగర్వంగా ఎగురవేసింది. విదేశీయులు ఒక తెలుగు చిత్రం గురించి ఈ స్థాయిలో పొగడటం ఇదే మొదటిసారి.
ఇప్పటికీ జపాన్ లాంటి దేశాల్లో ట్రిపులార్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. వంద రోజులు దాటినా ఇంకా అక్కడి థియేటర్లలో జక్కన్న సృష్టించిన మాయాజాలం ఆడుతూనే ఉంది. నెంబర్ వన్ స్థానంలో ఉన్న ముత్తుని దాటేసి అందనంత ఎత్తులో నిలబడిపోయింది. దగ్గరలో ఎవరైనా దాటడం కూడా అనుమానమే. యుఎస్, యుకె, లండన్ తదితర దేశాల్లో ఆర్ఆర్ఆర్ కు నీరాజనాలు పట్టారు. వరల్డ్ వైడ్ 1300 కోట్ల వసూళ్లను దాటేసిన ఆర్ఆర్ఆర్ త్వరలో చైనా రిలీజ్ కు రెడీ అవుతోంది. అదే జరిగితే ఆ రికార్డుని మళ్ళీ జక్కన్నే దాటాల్సి ఉంటుంది.
ఒక అరుదైన కలయికకు వేదికగా నిలిచిన ఆర్ఆర్ఆర్ చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. ఇద్దరు హీరోలు తమ విలువైన మూడేళ్ళ కాలాన్ని ఖర్చు పెట్టినందుకు దానికి మించిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్నారు. రాజమౌళి పేరుని జేమ్స్ క్యామరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి దిగ్గజాలు పలవరించారు. గతంలో ఎన్నో మరపురాని చిత్రాలు దిగ్గజ దర్శకులు ఇచ్చినప్పటికీ జక్కన్నకొచ్చిన పేరు మాత్రం అనంతం అపూర్వం. మహేష్ బాబుతో చేయబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఇంకా స్క్రిప్ట్ స్టేజిలోనే అంచనాలు ఎక్కడికో తీసుకెళ్తోంది.