సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక ఇప్పటి జనరేషన్ బ్రహ్మానందంని గొప్ప హాస్య నటుడిగానే చూస్తున్నారు తప్పించి నిజానికి బయటికి కనిపించని అద్భుతమైన సీరియస్ యాక్టర్ ఉన్నాడన్న విషయం ముప్పై ఏళ్ళ నుంచి సినిమాలు చూస్తున్న వాళ్ళకు తప్పించి మిగిలినవారికి అంతగా అవగాహన లేదు. 1992లో జంధ్యాల దర్శకత్వంలో ఈయన టైటిల్ రోల్ లో బాబాయ్ హోటల్ వచ్చింది. వన్ సైడ్ లవ్ లో ప్రేమ విఫలమైనవాడిగా, తాను దగ్గరుండి పెళ్లి చేసిన జంట యాక్సిడెంట్ లో చనిపోతే ఆ బాధను దిగమింగుకున్న పాత్రలో జీవించారు.
అంతకు ముందు సురేష్ కృష్ణ తీసిన అమ్మలోనూ మిమిక్రి ఆర్టిస్టుగా ఒక సీన్ లో పండించిన నటన ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆ తర్వాత క్రమంగా వరస హిట్ల వల్ల బ్రహ్మానందం కామెడీకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రంగమార్తాండ ద్వారా దర్శకుడు కృష్ణవంశీ చక్రపాణి పాత్రను సృష్టించి మరోసారి బ్రహ్మీ నట వైదుష్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ ని డామినేట్ చేసే స్థాయిలో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు, పలికిన సంబాషణలు నభూతో నభవిష్యత్. ఆ సన్నివేశం వెంటాడుతూనే ఉంటుంది
ఇంత గొప్పగా బ్రహ్మానందంని ఈమధ్య కాలంలో ఎవరూ చూపించలేదు. ఇదంతా ఎలా ఉన్నా రంగమార్తాండకు ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఇష్టపడే ప్రేక్షకుల నుంచి మద్దతు దక్కుతోంది కానీ కమర్షియల్ గా ఏ స్కేల్ మీద నిలబడుతుందనేది ఇప్పుడే చెప్పలేమని ట్రేడ్ టాక్. రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ చాలా నెమ్మదిగా మొదలయ్యాయి. బుధవారం రిలీజ్ కావడం, లాంగ్ వీకెండ్ దక్కించుకోవడం ఎలాంటి ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి. ఇళయరాజా సంగీతం, నెమ్మదిగా సాగే కథనం కొంత మైనస్ గా నిలవడం ప్రభావం చూపిస్తోంది