పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌లేద‌ని హీరోయిన్ హ‌ర్టు


ఈ రోజుల్లో ప్ర‌మోష‌న్లు సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌డానికి ముందు నుంచే మొద‌ల‌వుతున్నాయి. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ.. పోస్ట‌ర్, టీజ‌ర్ లాంటివి రిలీజ్ చేస్తూ అభిమానులు ఎంగేజ్ చేస్తుంటారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రిగే ప్ర‌మోష‌న్ల‌లో హీరోయిన్ల‌కు కూడా మంచి ప్రాధాన్య‌మే ద‌క్కుతుంటుంది. వాళ్ల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్ర‌త్యేక సంద‌ర్భాలు చూసుకుని స్పెష‌ల్ పోస్ట‌ర్లు, టీజ‌ర్లు వ‌దులుతుంటారు.

ఐతే ప్ర‌మోష‌న్ల‌లో త‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌లేద‌ని ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ ట్విట్ట‌ర్లో ఓపెన్‌గా త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం అన్న‌ది ఇంత‌కుముందెప్పుడూ చూసి ఉండ‌మేమో. కానీ భీమ్లా నాయ‌క్, బింబిసార‌, సార్.. ఇలా తెలుగులో వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్తున్న మ‌ల‌యాళ భామ సంయుక్త మీన‌న్ ఉగాది సంద‌ర్భంగా త‌న పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌లేద‌ని ట్విట్ట‌ర్లో త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్క‌డం గ‌మ‌నార్హం.

సంయుక్త.. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న విరూపాక్ష సినిమాలో న‌టించింది. ఐతే ఇప్ప‌టిదాకా రిలీజ్ చేసిన ప్రోమోల్లో ఆమెకు ప్రాధాన్యం ద‌క్క‌లేదు. పండుగ సంద‌ర్భంగా బుధ‌వారం త‌న పోస్ట‌ర్ రిలీజ్ చేస్తార‌ని హామీ ఇచ్చి.. ఆ మాట‌ను నిల‌బెట్టుకోలేదంటూ నిర్మాణ సంస్థ ఎస్వీసీసీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఐతే ఈ విష‌యం చెప్పడానికి ముందు ఈ సినిమా కోసం ప‌ని చేయ‌డం చాలా సంతోష‌మ‌ని పేర్కొంటూ నిర్మాణ సంస్థను కూడా కొనియాడింది. కానీ త‌న పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌క‌పోవ‌డాన్ని మాత్రం త‌ప్పుబ‌ట్టింది.

ఐతే వెంట‌నే ఎస్వీసీసీ ట్విట్ట‌ర్ హ్యాండిల్ నుంచి ఈ ట్వీట్‌కు స్పంద‌న వ‌చ్చింది. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌లేద‌ని.. త్వ‌ర‌లో స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు. ఐతే ఇదేమైనా ప‌బ్లిసిటీ గిమ్మిక్కా అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.