నాని ఎలా పెరిగిపోయాడేంటి..

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘దసరా’ ఇంకో పది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని అంటే బడ్జెట్, బిజినెస్, రిలీజ్ అన్నీ కూడా ఒక రేంజిలో ఉండేవి ఇప్పటిదాకా. కానీ ఈ చిత్రంతో నాని ఒకేసారి చాలా మెట్లు ఎక్కేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ రూ.60 కోట్లకు చేరిపోగా.. బిజినెస్ అంతకు 20 కోట్లు ఎక్కువే జరగడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ సినిమా రిలీజ్ గురించి వస్తున్న వార్తలు చూసి అవాక్కవకుండా ఉండలేం. ఈసారి వేసవిలో పెద్ద సినిమాలేవీ బరిలో లేకపోవడంతో ట్రేడ్ దృష్టి ప్రధానంగా ‘దసరా’ మీదే నిలిచింది. వేసవిలో విడుదల కానున్న తొలి క్రేజీ మూవీ ఇదే కావడంతో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1500 థియేటర్లలో సినిమా రిలీజవుతున్నట్లు తెలుస్తోంది. ఇక యుఎస్‌లో ఈ సినిమా రిలీజ్ లొకేషన్ల కౌంట్ అంతకంతకూ పెరిగిపోతోంది.

ముందేమో ‘దసరా’ యుఎస్ రిలీజ్‌ 400 లొకేషన్లలో అన్నారు. తర్వాత అది 500కు పెరిగింది. ఇప్పుడేమో ఏకంగా 600కు పైగా లొకేషన్లలో సినిమా రిలీజవుతున్నట్లు యుఎస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటిదాకా యుఎస్‌లో రిలీజైన ఇండియన్ సినిమాల్లో లొకేషన్ల పరంగా మూడో బిగ్గెస్ట్ రిలీజ్ ‘దసరా’దే అంటూ అనౌన్స్ చేయడం విశేషం.

నాని సినిమా ఇలాంటి లిస్టులో టాప్-3లో ఉండటం అంటే చిన్న విషయం కాదు. నాని ఒక్కసారిగా ఇంత పెద్ద రేంజికి వెళ్లిపోవడం ఊహకందని విషయం. టాప్ స్టార్లు నటించిన భారీ చిత్రాలను మించి ‘దసరా’ యుఎస్ రిలీజ్ ఉంటోందన్నమాట. ఇది పక్కా మాస్ సినిమా అయినప్పటికీ యుఎస్ ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి కనిపిస్తోంది. ప్రి సేల్స్ జోరుగా జరుగుతున్నాయి. టాక్ బాగుండేలా కానీ డాలర్లు మిలియన్ల రూపంలో కురవడం గ్యారెంటీ. ఈ నెల 29న యుఎస్‌లో ‘దసరా’కు ప్రిమియర్స్ పడనున్నాయి.