సమీక్ష – ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

2/5

2 hr 20 mins   |   Love   |   17-03-2023


Cast - Naga Shaurya, Malvika Nair, Srinivas Avasarala, Megha Chowdhury and others

Director - Srinivas Avasarala

Producer - T G Vishwa Prasad and Padmaja

Banner - Dasari Productions

Music - Kalyani Malik

ఫీల్ గుడ్ సినిమాలకు ఫ్యామిలీస్ తో పాటు యూత్ ఆడియన్స్ మద్దతు బాగుంటుంది. అందుకే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మీద భారీ అంచనాలు లేకపోయినా హీరో నాగశౌర్య చెప్పినట్టు కంటెంట్ ఏమైనా జనాన్ని తీసుకొస్తుందేమోననే నమ్మకం ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుల్లోనూ కలిగింది. దానికి తోడు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం కావడంతో ఈ జానర్ ని ఇష్టపడే వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూశారు. నాగ శౌర్య – మాళవిక నాయర్ జంటగా రూపొందిన ఈ లవ్ రామ్ కామ్ మెప్పించిందో లేదో చూద్దాం.

కథా నేపథ్యం 2010లో మొదలై పదేళ్ల నిడివితో చాఫ్టర్ల రూపంలో జరుగుతుంది. వైజాగ్ లో ఇంజినీరింగ్ చేరిన సంజయ్ (నాగ శౌర్య)కు సెకండియర్ చదువుతున్న అనుపమ(మాళవిక నాయర్)తో స్నేహం విదేశాలకు వెళ్లి కలిసి మాస్టర్స్ చేసే దాకా పెరుగుతుంది. ఇద్దరూ ఫ్రెండ్ షిప్ కే పరిమితమైనా క్రమంగా అది ప్రేమని తెలుసుకుంటారు. ఈలోగా కొన్ని అనూహ్య పరిణామాల వల్ల బ్రేకప్ అవుతుంది. కొంత గ్యాప్ తర్వాత సంజయ్ యుకెలోనే రెస్టారెంట్ పెట్టుకుంటాడు. అక్కడికి వచ్చిన అనుపమను చూసాక తిరిగి జ్ఞాపకాలు మొదలవుతాయి. వీళ్ళ ప్రేమ మళ్ళీ చిగురించిందా మధ్యలో వచ్చిన గిరి(అవసరాల శ్రీనివాస్)ఎవరు ప్రశ్నలకు సమాధానమే స్టోరీ.

స్నేహం ప్రేమ చుట్టూ తిరిగే కథలు తెలుగులో ఇప్పటికే కొన్ని వందలు వచ్చాయి. హిట్ అయినవీ ఉన్నాయి. తేడా కొట్టి జనాలు మర్చిపోయినవీ ఉన్నాయి. మనం ఏ క్యాటగిరిలో పడాలనేది దర్శకుడు రచయిత రాసుకునే కోణాన్ని బట్టి ఉంటుంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిలో లైన్ పరంగా కొత్తదనం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. కేవలం ఒక జంట మధ్య భావోద్వేగాలను సంభాషణల రూపంలో కవితాత్మకంగా చెప్పాలనేది అవసరాల శ్రీనివాస్ ప్రయత్నం. డ్రామా, ట్విస్టులు, వీలైనన్ని ఎక్కువ పాత్రలు ఇవేవి లేకుండా ఫ్లాట్ గా చెబితే చూసేవాళ్ళు నిజాయితీని ఫీలవుతారని స్క్రిప్ట్ రాసుకున్నారు కాబోలు. సరిగ్గా ఈ అంశం దగ్గరే తేడా జరిగింది.

అవసరాల మొదటి చిత్రం ఊహలు గుసగుసలాడే వచ్చి తొమ్మిదేళ్లు అవుతోంది. ఆ టైంలో అలాంటి ట్రీట్మెంట్ యువతకు ఫ్రెష్ గా అనిపించి హిట్ చేశారు. క్యూట్ అనిపించే రాశిఖన్నా అందం, నాగ శౌర్య అమాయకత్వం దాని విజయంలో కీలకపాత్ర పోషించాయి. అవసరాల శ్రీనివాస్ ఇంకా అక్కడే ఉండిపోయారు. ఇంత పెద్ద గ్యాప్ లో వచ్చిన మార్పులు, అభిరుచులు, కరోనా ప్రభావాలు, ఓటిటిలు ఇవేవీ పట్టించుకోకుండా తన మానాన తాను ఫఅఫఅని రాసుకున్నారు. సరే ప్రతిదీ కొత్తగా వెరైటీగా ఉండాలన్నా రూలేం లేదు కానీ కనీస స్థాయిలో వినోదం చాలా అవసరం. కానీ ఈ అబ్బాయి అమ్మాయిలో ప్రధానంగా లోపించింది, అసలు ఉద్దేశాన్ని దెబ్బ కొట్టింది ఇదే.

ఫస్ట్ హాఫ్ ని పూర్తిగా సంజయ్ అనుపమల మధ్య బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు దాని చుట్టూ కాసింత మోతాదులో కామెడీ కోటింగ్, అదనపు క్యారెక్టర్లతో కావాల్సినంత వినోదం దట్టించుకోవాలి. అంతే తప్ప లీడ్ పెయిర్ చుట్టూ కెమెరా తిరుగుతూ ఉంటే బోర్ కొట్టేస్తుంది. దానికి తోడు దాదాపు సినిమా మొత్తం యుకెలోనే జరగడం నేటివిటీ ఫ్యాక్టర్ ని తగ్గించేసి కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కిల్ చేస్తూ పోయింది. శేఖర్ కమ్ముల ఫిదా, వరుణ్ తేజ్ తొలిప్రేమలోనూ ఇదే తరహా బ్యాక్ డ్రాప్ ఉంటుంది. కానీ వాటికి ముందు వెనుకా ఆయా దర్శకులు షుగర్ కోటింగ్ ని పర్ఫెక్ట్ గా అద్దారు కాబట్టే అవి అంత పెద్ద హిట్టయ్యాయి. అవసరాల ఈ కోణంలో ఆలోచించలేదు

అసలు ఆ ప్రేమజంట క్యారెక్టరైజేషనే కన్ఫ్యుజింగ్ గా ఉంటుంది. అపార్థం చేసుకోవడానికి కారణాలు చూపిస్తున్నా అవి కన్విన్సింగ్ గా ఉండవు. క్లైమాక్స్ లో తిరిగి కలుసుకోవడం ఆడియన్స్ పర్సనల్ గా ఫీలవ్వాలంటే విడిపోక ముందు జరిగే సంఘటనల్లో డ్రామా ఖచ్చితంగా ఉండాలి. అంతే తప్ప సహజత్వం పేరుతో ఓవర్ న్యాచులారిటీని జొప్పిస్తే థియేటర్లో చూస్తున్న కళ్ళు కాళ్ళు రెండూ అలిసిపోతాయి. అవసరాల శ్రీనివాస్ లో గొప్ప భావుకుడు ఉన్న మాట వాస్తవం. జో అచ్యుతానందలోనూ అది ఋజువు చేశాడు. కానీ ఆ భావుకత్వం సినిమా పరిధి దాటిపోయి సీరియల్ ట్రీట్ మెంట్ లోకి రావడంతో అతని ప్రత్యేకతే ఈసారి బలహీనతగా మారింది

ఘాడమైన ప్రేమలో ఉన్న వాళ్ళు, ఇలాంటి బ్రేకప్స్ అనుభవించిన వాళ్ళు ఈ అబ్బాయి అమ్మాయిలో తమను తాము చూసుకోవచ్చేమో కానీ ఆ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అసలు టార్గెట్ గా నిలిచిన యూత్ ని మెప్పించే కంప్లీట్ ప్యాకేజ్ గా నిలవలేకపోయింది. మాళవిక నాయర్ ఎంత టాలెంటెడ్ నటి అయినప్పటికి సాయిపల్లవి లాగా నటనతో మేజిక్ చేసే ఛార్మ్ కానీ ఇంతకు ముందు చెప్పినట్టు రాశిఖన్నాలోని సౌమ్యమైన సున్నితత్వం లేకపోవడంతో కథనంలో ఉన్న లోపాలను కవర్ చేయలేకపోయింది. ఎంత ల్యాగ్ ఉన్నా సరే కాసింత ఎమోషన్ ఉన్నా చాలు చూసేస్తాం అనుకుంటే తప్ప రెండుంపావు గంటలు తట్టుకోవడం ఇబ్బందే

తన శక్తివంచన లేకుండా విభిన్న ప్రయోగాలు చేస్తున్న నాగశౌర్యని ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతున్నా తప్పుబట్టలేం. తనవంతుగా దర్శకుడు అడిగిన దానికి న్యాయం చేశాడు. మాళవిక నాయర్ కాసింత తొందరపాటుతనం పొగరు నిండిన అనుపమగా చక్కగా ఒదిగిపోయింది. అవసరాల శ్రీనివాస్ కొంత భాగానికే పరిమితం. మేఘా చౌదరి అంతగా నప్పకపోయినా పర్వాలేదనిపించింది. హీరోయిన్ అక్కగా నటించిన వారణాసి సౌమ్య, సెకండ్ హాఫ్ లో కొంత హడావిడి చేసిన హరిణి రావులు కొంత మేర ఓకే. శౌర్య ఫ్రెండ్ గా నటించిన అభిషేక్ మహర్షితో జోకులు వేయించారు కానీ అక్కడక్కడే పేలాయి. బాలన్స్ లో పెద్దగా చెప్పుకునే ఆర్టిస్టులు లేరు

కళ్యాణి మాలిక్ సంగీతంలో ఘాడత ఉంది. రెండు పాటలు బాగున్నాయి. ఆన్ లైన్లో బాగా వెళ్లిన కనుల చాటు మేఘమా సాంగ్ ఆలస్యంగా రావడం మైనస్సే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గొప్పగా లేదు కానీ చప్పగా ఉందని చెప్పడానికి లేకుండా నీట్ గా ఇచ్చారు. సునీల్ కుమార్ నామ ఛాయాగ్రహణం మరీ ప్రత్యేకంగా లేదు. పరిమిత లొకేషన్లకు కట్టుబడటంతో పనితనం చూపించే అవకాశం తగ్గిపోయింది. కిరణ్ గంటి ఎడిటింగ్ ని ల్యాగ్ కు కారణమని చెప్పలేం. వీలైనంత క్రిస్పీగా ఉండేలా కట్ చేశారు కాబట్టి నిందించలేం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి బడ్జెట్ లో సింహభాగం యుకె షెడ్యూల్ కి ఖర్చు కావడం తప్ప మిగిలిన విషయాల్లో భారీతనం ఎక్కడా కనిపించలేదు. జస్ట్ కూల్

ప్లస్ పాయింట్స్

లీడ్ పెయిర్ నటన
సంగీతం
తక్కువ నిడివి

మైనస్ పాయింట్

అతి నెమ్మదిగా సాగే కథనం
పాత్రల మధ్య సంఘర్షణ
ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం
స్టోరీ పాతదే

ఫినిషింగ్ టచ్ : స్లో అబ్బాయి ల్యాగ్ అమ్మాయి

రేటింగ్ : 2. / 5