ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను అనౌన్స్ చేసినపుడు అభిమానుల్లో ఎంతో ఎగ్జైట్మెంట్ కనిపించింది. ‘తానాజీ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు 500 కోట్ల బడ్జెట్లో రామాయణ గాథను భారీ స్థాయిలో వెండితెరపై ప్రెజెంట్ చేయబోతున్నట్లు వెల్లడించినపుడు ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మేకింగ్ దశలో ఉన్నంత వరకు హైప్ మామూలుగా లేదు. కానీ టీజర్ వచ్చాక ప్రభాస్ అభిమానులే కాక అందరూ చల్లబడిపోయారు.
అసహజమైన గ్రాఫిక్స్.. ప్రధాన పాత్రధారుల మేకప్ విపరీతమైన నెగెటివిటీకి కారణమైంది. ఈ నెగెటివిటీ ఏ స్థాయికి చేరిందంటే.. ఉన్నదున్నట్లుగా సినిమాను రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పదని భయపడి.. గ్రాఫిక్స్, మేకప్ విషయంలో మళ్లీ వర్క్ చేయాలని సినిమాను ఆరు నెలల పాటు వాయిదా వేసేసింది చిత్ర బృందం.
జూన్ 16కు కొత్త రిలీజ్ డేట్ ఇచ్చినప్పటికీ పక్కాగా ఆ తేదీకి సినిమా వస్తుందా రాదా అనే సందేహంలోనే ఉన్నారు అభిమానులు. ఐతే ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయిన టైంలో నిన్నంతా సోషల్ మీడియాలో ‘ఆదిపురుష్’ ట్రెండ్ అయింది. మంగళవారం నుంచి సినిమా విడుదలకు సరిగ్గా వంద రోజులు ఉన్న నేపథ్యంలో కౌంట్ డౌన్ ట్వీట్లతో ప్రభాస్ అభిమానులు ట్విట్టర్‌ను హోరెత్తించారు. టీజర్ చూసి సినిమాను తక్కువ అంచనా వేయొద్దని.. జూన్ 16న ‘ఆదిపురుష్’ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని.. ఇదొక ఎపిక్ మూవీలా నిలిచిపోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్లు వేశారు.
ఐతే వంద రోజుల కౌంట్ డౌన్ పేరుతో అభిమానుల హంగామా బాగానే ఉంది కానీ.. చిత్ర బృందం మాత్రం ఈ ట్రెండ్‌లో భాగం కాలేదు. దర్శక నిర్మాత ఓం రౌత్ వంద రోజుల కౌంట్ డౌన్ గురించి ఏ ట్వీట్ వేయలేదు. నిజానికి ఈ పాన్ ఇండియా సినిమా ప్రమోషన్లకు 100 రోజుల కౌంట్ డౌన్ మంచి అవకాశమే. కానీ టీం దాన్ని ఉపయోగించుకోలేదు. దీంతో నిజంగా ఈ సినిమా అనుకున్న ప్రకారం రిలీజవుతుందా.. టీం ఆ విషయంలో నమ్మకంగా ఉందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి అభిమానులకు.