భోళాను కాచుకోవడమే నాని ముందున్న సవాల్

న్యాచురల్ స్టార్ నాని ప్యాన్ ఇండియా డెబ్యూకి పెద్ద ప్లానే వేసుకుంటున్నాడు. మార్చి 30 విడుదల కాబోతున్న దసరా కోసం ఈ నెల మొత్తం కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ దేశం మొత్తం తిరిగి ప్రమోషన్లు చేయాలని డిసైడ్ అయ్యాడు. తాజాగా ముంబైలో చేసిన ఈవెంట్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అక్కడి అభిమానులతో కలిసి హోలీ ఆడటమే కాకుండా ఓ పాటను స్క్రీనింగ్ చేసి మరీ వాళ్ళ మనసులు గెలుచుకునే ప్రయత్నం చేశాడు. నార్త్ బెల్ట్ లో నానికి అంతగా గుర్తింపు లేదు. డబ్బింగ్ సినిమాల్లో చూడటమే తప్ప ఇప్పటిదాకా థియేటర్ ఎంట్రీ ఇవ్వలేదు.

అందుకే దసరాని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. సెటప్ అంతా బాగానే ఉంది కానీ నాని ప్యాన్ ఇండియా జెండా పాతాలంటే ఒకే ఒక్క అడ్డంకి ఉంది. అదే అజయ్ దేవగన్ భోళా. ఇది కూడా మార్చి 30నే రిలీజ్ కానుంది. పేరుకి కార్తీ ఖైదీ రీమేకే కానీ దీనికి భారీ మార్పులు చేశారు. కమర్షియల్బ్ ఫ్లేవర్ ని దిట్టంగా జోడించారు. అతనే స్వయంగా దర్శకత్వం వహించాడు. టబు పోలీస్ ఆఫీసర్ గా చేయడం, భారీ యాక్షన్ సీక్వెన్సులు లాంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. అన్నింటి మించి దృశ్యం 2 థియేట్రికల్ సక్సెస్ బిజినెస్ పరంగా చాలా హెల్ప్ అవుతోంది.

ఉత్తరాది డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు భోళాకు భారీ ఎత్తున సహకారం అందించబోతున్నారు. దసరా లాంటి డబ్బింగ్ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు దక్కడం ఇబ్బందవుతుంది. అందుకే అజయ్ కు సరైన పోటీ అనిపించేలా ట్రైలర్ కట్ తో పాటు ఇతరత్రా పబ్లిసిటీ మెటీరియల్ ని స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. దసరా కనక కరెక్ట్ గా వర్కౌట్ నాని మార్కెట్ అన్ని భాషల్లోనూ పెరుగుతుంది. అందుకే దీని మీద ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు. చేతిలో ఉన్నది 23 రోజులే కావడంతో టీమ్ ఉరుకుల పరుగుల ప్రోగ్రాంస్ చేసుకుంటోంది. మరి భోళా తాకిడిని ఎలా తట్టుకుంటుందో చూడాలి.