బావ బావే పేకాట పేకాటే అన్నది నిర్మాత సురేష్ బాబు సిద్ధాంతం. అంత నిక్కచ్చిగా క్యాలికులేటెడ్ గా ఉంటారు కాబట్టే దశాబ్దాల తరబడి నెగ్గుకుంటూ రాగలిగారు. బిజినెస్ వ్యవహారాల్లో ఎమోషన్లు సెంటిమెంట్లకు చోటివ్వరు. నారప్ప, దృశ్యం 2 ఓటిటి విడుదల విషయంలో అభిమానుల నుంచి విపరీతమైన ఒత్తిడి, విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గకుండా నో థియేటర్స్ అనేశారు. దాని వెనుక ఉన్న ఒకే కారణం పెట్టుబడిని రిస్క్ లో పెట్టకూడదనే ఉద్దేశమే. ఎంత స్వంత తమ్ముడి సినిమాలే అయినా తనతో ఉన్న భాగస్వామ్యులకు నష్టం రాకూడదనే ఆలోచనది.
అసలు విషయానికి వస్తే దగ్గుబాటి అభిరాంని హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో రూపొందిన అహింస రిలీజ్ వ్యవహారం ఎంతకీ తేలడం లేదు. అతి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, రానా తమ్ముడు, బాబాయ్ వెంకటేష్, రామానాయుడు తాతయ్య, ఇలా పవర్ ఫుల్ సెటప్ ఇంతా ఉన్నా అహింస మాత్రం పురిటినొప్పులు పడుతూనే ఉంది. షూటింగ్ టైంకి పూర్తి చేసినప్పటికి నిర్మాణానికి అయిన వ్యయం బిజినెస్ కోసం వస్తున్న ఆఫర్లకు మధ్య పొంతన కుదరడం లేదట. నెల రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ బాగానే ఉన్నా అంచనాలు రేకెత్తించడంతో సక్సెస్ కాలేకపోయింది.
అందుకే మంచి డేట్లు మిస్ అవుతున్నా చూస్తూ ఉండటం తప్ప సురేష్ బాబు ఏం చేయలేకపోతున్నారని వినికిడి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు నిజంగా అనుకోవాలే ఇప్పటికిప్పుడు అహింసను రెండు రోజుల్లో రిలీజ్ చేసే కెపాసిటీ సురేష్ బాబుకుందని అందరికీ తెలుసు. రానా కూడా ఎందుకనో తమ్ముడి విషయంలో మౌనంగా ఉంటున్నాడే తప్ప చొరవ చూపించడం లేదు. కంబ్యాక్ దీంతో జరుగుతుందని ఆశలు పెట్టుకున్న తేజ మాత్రం ఒకపక్క ఇంటర్వ్యూలు మొదలుపెట్టేశారు. మరి ఈ అహింసకు ఎప్పుడు మోక్షం కలిగిస్తారో చూడాలి మరి.