సౌండ్ చేయకుండా వీరయ్యను వదిలేశారు

మాములుగా థియేటర్ రిలీజులే కాదు ఓటిటి ప్రీమియర్లకు సైతం వీకెండ్లను టార్గెట్ చేసుకోవడం ముందు నుంచి ఉన్నదే. అందులో చాలా మటుకు శుక్రవారం సెంటిమెంట్ నే ఫాలో అవుతాయి. వీరసింహారెడ్డిని బుధవారం నుంచి స్ట్రీమింగ్ చేయడం వల్ల రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదయ్యాయి. కానీ వాల్తేరు వీరయ్యని ఈ ట్రెండ్ కి భిన్నంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి తేవడం పట్ల మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. పైగా దీనికి సంబంధించి ఎలాంటి కొత్త ట్రైలర్ విడుదల చేయకుండా పాతదే వాడుకుని అది కూడా కొన్ని గంటల ముందు విడుదల చేశారు.

తెగింపుకి విపరీతమైన ప్రమోషన్లు చేసిన నెట్ ఫ్లిక్స్ వీరయ్య మీద మాత్రం శీతకన్ను వేసింది. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం నిర్మాతల అభ్యర్థన మేరకే ప్రచారం పెద్దగా చేయలేదని తెలిసింది. ఎందుకంటే వాల్తేరు వీరయ్య మార్చి 3తో యాభై రోజులు పూర్తి చేసుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 69 కేంద్రాల్లో డైరెక్ట్ రన్ నమోదు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓటిటి ప్రచారం ఎక్కువ జరిగితే అసలే అంతంత మాత్రంగా ఉన్న వసూళ్లు ఈ చివరి మూడు నాలుగు రోజులు ఇంకా దారుణంగా పడిపోతాయి. నెలరోజులు మంచి నెంబర్లు నమోదు చేసిన మెగా మూవీ తర్వాత నెమ్మదించేసింది

ఈమధ్య చిరంజీవి సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ కొంటోంది. గాడ్ ఫాదర్ గత ఏడాది సొంతం చేసుకోగా రాబోయే భోళా శంకర్ హక్కులు కూడా కొనేసింది. మరి ఇంత బ్రాండ్ ని నమ్మినప్పుడు పబ్లిసిటీ కూడా ఆ రేంజ్ లో ఇవ్వడం అవసరం. అయితే ఎలాగూ ఓటిటిలో వచ్చేసింది కాబట్టి ఇకపై డిజిటల్ ఆడియన్స్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. థియేటర్లలో భీకరంగా ఆడినవి తీరా స్మార్ట్ స్క్రీన్ లోకి వచ్చాక ట్రోలింగ్ కు గురవుతున్నాయి. జాతిరత్నాలు, ఎఫ్3, వారసుడు ఇవన్నీ కోట్లు కొల్లగొట్టినవి. కానీ నెటిజెన్ల చేతిలో తిట్లు తిన్నవి. మరి వీరయ్య ఏ క్యాటగిరీలోకి వస్తాడో