‘చరణ్’ పేరు పలకలేక సారీ

హాలీవుడ్లో జరిగే అంతర్జాతీయ సినిమా అవార్డుల వేడుకల్లో టాలీవుడ్‌కు ప్రాతినిధ్యం దక్కుతుందని.. మన వాళ్లు అక్కడ అవార్డులు అందుకుని, వేదికలెక్కి మాట్లాడతారని.. మన వాళ్ల గురించి అక్కడి వాళ్లు గొప్పగా మాట్లాడుతారని కలలో కూడా ఊహించి ఉండం. కానీ మన దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఊహకు కూడా అందని విషయాలను నిజం చేస్తున్నాడు.

గత ఏడాది వేసవిలో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైన దగ్గర్నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు. నెట్ ఫ్లిక్స్ ద్వారా ‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్‌గా రిలీజయ్యాక దీనికి వచ్చిన అప్రిసియేషన్.. ఆపై థియేటర్లలో సినిమాను రీ రిలీజ్ చేస్తే, స్పెషల్ ప్రిమియర్స్ వేస్తే.. నేటివ్ అమెరికన్స్ నుంచి వచ్చిన స్పందన అసాధారణం. ఆపై వివిధ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో, అవార్డుల వేడుకల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటుతూ వస్తోంది.

తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’కు గౌరవం దక్కింది. ఉత్తమ యాక్షన్ సినిమాగానే పేరున్న హాలీవుడ్ చిత్రాలను పక్కకు నెట్టి అవార్డును సొంతం చేసుకుంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ అవార్డుల కార్యక్రమానికి చిత్ర కథానాయకుల్లో ఒకడైన రామ్ చరణ్ హాజరు కావడం విశేషం. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కార్యక్రమం కోసం యుఎస్‌కు వెళ్లిన చరణ్.. ఆ తర్వాత హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులకు హాజరైన కాసేపు అవార్డు ప్రెజెంటర్ పాత్రను పోషించడం విశేషం. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

రామ్ చరణ్‌ను వేదిక మీదికి పిలిచేటపుడు వ్యాఖ్యాత టిగ్ నొటారో ఇబ్బంది పడింది. గ్లోబల్ సూపర్ స్టార్‌గా చరణ్‌కు కొనియాడుతూ.. ‘రామ్’ అనే పదం పలికాక ఆమె ఆగిపోయింది. ‘చరణ్’ అనే పేరును ఎలా పలకాలో తెలియట్లేదని అంది. వెనుకనుంచి ఆమెకు ఎవరో మాట అందించాక.. ఒక డిఫరెంట్ మాడ్యులేషన్లో ‘చరణ్’ పేరును పలికిందామె. చరణ్ వేదిక మీదికి వచ్చాక.. తన పేరును సరిగా పలకలేకపోయినందుకు ఆమె సారీ చెప్పింది. అనంతరం హాలీవుడ్ నటి అంజలి భీమానితో కలిసి ప్రెజెంటర్ పాత్రను పోషించాడు చరణ్.