హైదరాబాద్ లో అతిపెద్ద మల్టీప్లెక్స్

అదేంటో భాగ్యనగర వాసుల అవసరాలు తీర్చడానికి ఉన్న థియేటర్లు సరిపోవడం లేదనో ఏమో కొత్త కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు ఎగ్జిబిషన్ రంగంలో తమ పట్టుని నిలుపుకోవడానికి హైదరాబాద్ ని టార్గెట్ గా మార్చుకుంటున్నారు. ఒకవైపు సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. టికెట్ ధర ఎక్కువ ఉన్నా పర్లేదు సౌకర్యాలే ముఖ్యమనుకుంటున్న ప్రేక్షకులు ఖర్చు గురించి ఆలోచించడం లేదు. అందుకే మల్టీ ప్లెక్సుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. పెరుగుతున్న నగర జనాభాను దృష్టిలో ఉంచుకుని వీటిని విస్తరిస్తున్నారు.

తాజాగా సిటీలోనే అతి పెద్ద మల్టీప్లెక్సుకు రంగం సిద్ధమవుతోంది. కర్మాన్ ఘాట్ లో 11 స్క్రీన్ల సముదాయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో మొత్తం 2700 సీట్లు అందుబాటులో ఉంటాయి. టిఎన్ఆర్ ప్రిస్టన్ మాల్ పై అంతస్తులో దీని నిర్మాణం జరుగుతోంది. ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న చైన్ ఇదే మొదటిది అవుతుంది. ప్రాజెక్టు మొదలుపెట్టింది పివిఆర్ ఐనాక్స్ అయినప్పటికీ యాజమాన్యం చేతులు మారొచ్చనే టాక్ ఉంది. ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఇకపై సినిమాల కోసం వేరే ఏరియా గురించి ఆలోచించాల్సిన పని లేదన్న మాట. 2023 ఫస్ట్ హాఫ్ లో ఓపెన్ చేస్తారు.

నిజానికి థియేటర్ వ్యవస్థ ఒడిదుడుకులు చూస్తున్న టైంలో ఇలా ఇన్నేసి స్క్రీన్లు పెట్టడం చూస్తే ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే వారాల తరబడి హౌస్ ఫుల్ కావడం కష్టమైపోతున్న ట్రెండ్ లో కొన్ని శుక్రవారాలు అసలు చెప్పుకోదగ్గ రిలీజులే ఉండటం లేదు. ఎన్నో సందర్భాల్లో కనీస సంఖ్యలో ఆడియన్స్ లేక షోలు క్యాన్సిల్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఏఎంబి మాల్ సూపర్ సక్సెస్ అయ్యాక అలాంటివి మరికొన్ని మొదలుపెట్టే ప్రణాళికలు ఊపందుకున్నాయి.