ఇరవై మూడు రోజులు ఆసుపత్రిలో జబ్బుతో పోరాటం చేసి కన్నుమూసిన తారకరత్న భౌతికంగా లేకపోయినా తన జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే ఇండస్ట్రీకి సంబంధించి అతను ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు.
అందులో ప్రధానమైంది డెబ్యూని అంగరంగవైభవంగా ఒకే రోజు 9 సినిమాలతో ప్రారంభోత్సవం జరుపుకోవడం. ఇది వరల్డ్ రికార్డు. ఇప్పటిదాకా ఏ భాషలో ఏ హీరో తన మొదటి లాంచ్ ఇంత గ్రాండ్ గా జరుపుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులోనూ ఇది సాధ్యం కాదు.
2002 సంవత్సరం. రామకృష్ణ స్టూడియోస్ ప్రాంగణం. మార్చి 22న పరిశ్రమ చాలా అరుదుగా చూసే కోలాహలం నెలకొంది. నందమూరి మోహనకృష్ణ తనయుడు తారకరత్నను తొమ్మిది సినిమాలతో పరిచయం చేయబోతున్నట్టు మీడియాలో ఇచ్చిన ప్రకటన సంచలనంగా మారింది.
ఆ చిత్రాల దర్శకులు యు నారాయణరావు, బాలసుబ్రమణ్యం, సురేష్ కృష్ణ, సాయికృష్ణ, రామచంద్రరావు, సత్యానంద్, సాగర్, వైవిఎస్ చౌదరిలు. ఉప్పలపాటి సూర్యనారాయణబాబు నిర్మాతగా సెట్ చేసిన ప్రాజెక్టుకి మాత్రమే ఆ రోజుకి డైరెక్టర్ డిసైడ్ కాలేదు. వీళ్లంతా ఓపెనింగ్ కి వచ్చారు.
ఊహించని ట్విస్టు ఏంటంటే మొదట రిలీజైన ఒకటో నెంబర్ కుర్రాడు మాత్రం పైన చెప్పిన లిస్టులో లేదు. ఇది తర్వాత ఓకే అయిపోయి శరవేగంగా నిర్మాణం జరుపుకుని ముందు విడుదలయ్యింది. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా మరికొన్ని సెట్స్ పైకి వెళ్లకుండానే దర్శక నిర్మాతలు మారినవి ఉన్నాయి.
నందమూరి, నారా కుటుంబాలు ఆ రోజు జరిగిన వేడుకకు హాజరయ్యారు. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా వచ్చారు. బాలకృష్ణే స్వయంగా ఈ కాంబినేషన్లకు ప్రొడ్యూసర్లకు సంబంధించిన వ్యవహారాలు దగ్గరుండి చూసుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates