పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి దశాబ్దం కిందటే విడిపోయినప్పటికీ.. రేణు దేశాయ్ తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సినిమాలకు దూరం అయినప్పటికీ.. టీవీ షోలు, ఇంటర్వ్యూల ద్వారా ఆమె జనాలను ఏదో రకంగా పలకరిస్తూనే ఉంది.
పవన్ కళ్యాణ్ గురించి ఆమె ఏం మాట్లాడినా ఆయన అభిమానులతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తిగా గమనిస్తారు. రేణు వ్యక్తిగత విషయాల మీద కూడా అమితాసక్తిని ప్రదర్శిస్తారు.
తాజాగా ఆమె తాను అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు వెల్లడించడం అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. తాను గుండె సంబంధిత సమస్యతో పాటు వేరే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు ఆమె వెల్లడించింది. ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా రేణు ఈ విషయాన్ని బయటపెట్టింది.
‘‘అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను కొన్నేళ్లుగా గుండె సంబంధిత సమస్య, మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నాననంటే.. నాలా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి ధైర్యాన్నివ్వడానికి, వారిలో పాజిటివిటీ పెంచడానికే. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ధైర్యం కోల్పోకూడదు. ఎప్పుడూ బలంగా ఉండాలి. అలా ఉంటే ఎప్పటికైనా సానుకూల ఫలితం వస్తుంది. మీపై, మీ జీవితంపై ఆశలు కోల్పోవద్దు. ఈ విశ్వం మన కోసం ఎన్నో అద్భుతాలను దాచి ఉంచింది. ఎలాంటి పరిస్థితులనైనా నవ్వుతూ ఎదుర్కోవాలి’’ అని రేణు తెలిపింది. ప్రస్తుతం తాను అనారోగ్యానికి చికిత్స పొందుతూనే యోగా చేస్తున్నానని.. మందులు, పోషకాహారం తీసుకుంటున్నానని చెప్పిన రేణు. త్వరలోనే మామూలు స్థితికి చేరుకుని తిరిగి కెమెరా ముందుకు రావాలనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates